
రాయల్స్ విజయం
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి
విశాఖ స్పోర్ట్స్: ఏపీఎల్‌లో భాగంగా వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో అమరావతి రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లయన్స్ జట్టు తొమ్మిది వికెట్లకు 139 పరుగులే చేసింది. ఓపెనర్ అభిషేక్ ఒక పరుగుకే పెవిలియన్ చేరగా.. పవన్ కుమార్(30)తో మరో ఓపెనర్ హానీష్ వీరారెడ్డి కలిసి స్కోర్‌ను 51 పరుగులకు చేర్చారు. కెప్టెన్ రికీబుయ్ ఐదు పరుగులకే వెనుతిరగ్గా వీరారెడ్డి (41) 87 పరుగుల వద్ద ఔటయ్యాడు. సందీప్(10), దుర్గాకుమార్(14), అజయ్‌కుమార్(18) రెండంకెల స్కోర్లే చేయగలిగారు. సందీప్ మూడు వికెట్లు తీయగా హనుమ విహారి, అయ్యప్ప, సంతోష్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ప్రతిగా రాయల్స్ జట్టు 15 ఓవర్లలోనే ఆటను ముగించేసింది. కెప్టెన్ హనుమ విహారి 62, ప్రసాద్ 21, ప్రణీత్ 44 పరుగులతో రాణించారు. విజయ్ రెండు, దుర్గాకుమార్ ఒక వికెట్ తీశారు.
వారియర్స్ గెలుపు
ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన మరో మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ విజయం సాధించింది. టాస్ ఓడి కాకినాడ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 4.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 22 పరుగులు చేసిన స్థితిలో వరుణుడు రాకతో మ్యాచ్ ఆగింది. ఆటను ఏడు ఓవర్లకు కుదించగా తిరిగి ఇన్నింగ్స్ కొనసాగించిన కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయి 37 పరుగులే చేసింది. మనీష్ 14 పరుగులు చేయగలిగాడు. స్టీఫెన్, తోషిత్ రెండేసి వికెట్లు తీశారు. ప్రతిగా వారియర్స్ ఓపెనర్లు జ్ఞానేశ్వర్(15), ప్రశాంత్(25) వికెట్ కోల్పోకుండానే 13 బంతుల్లోనే విజయాన్నందించారు.