
12 ఏళ్లుగా కళ్లు గప్పి.. ఎట్టకేలకు చిక్కి!
నవ వధువు హత్య కేసులో నిందితుడి అరెస్టు
పెదగంట్యాడ: ఓ హత్య కేసులో 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని న్యూపోర్టు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలివి. 2013లో మండలంలో ఒక వీధిలోని నాలుగో అంతస్తు పెంట్‌హౌస్‌లో నవ వధువు త్రివేణి తన భర్తతో కలిసి నివసించేది. పక్కనే ఉన్న మరో పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటున్న నీలాపు లోకేష్ ఆమైపె కన్నేశాడు. ఇంట్లో త్రివేణి ఒంటరిగా ఉండటం గమనించి, ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. త్రివేణిపై లైంగికదాడికి ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోకేష్ ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహం పక్కన చున్నీని కాల్చివేసి, గ్యాస్ తెరిచి ఉంచాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. తర్వాత గాజువాకలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఆ బంగారు ఆభరణాలను కుదువ పెట్టి రూ.55వేలు తీసుకున్నాడు. ఆ డబ్బులో రూ.30వేలతో బైక్ కొనుగోలు చేయడానికి అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మిగతా రూ.25 వేలును తన స్నేహితునికి ఇచ్చి, ఏమీ తెలియనట్టుగా ఇంటికి చేరుకున్నాడు.
పోలీసులు పట్టుకున్నారిలా..
నవ వధువు హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పటికే గాజువాక పోలీస్ స్టేషన్‌లో లోకేష్‌పై మోటార్ బైక్ దొంగతనం కేసు నమోదై ఉంది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించగా.. త్రివేణిని తానే హత్య చేసినట్టు లోకేష్ అంగీకరించాడు.
బెయిల్‌పై వచ్చి మళ్లీ..
వధువు హత్య కేసులో జైలుకెళ్లిన లోకేష్ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో లోకేష్‌ను వెతికి పట్టుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి న్యూపోర్టు పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో అతను విజయవాడలో ఉన్నాడని సమాచారం అందడంతో.. ఏఎస్‌ఐ మురళి, కానిస్టేబుల్ సింహాద్రిని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు అక్కడకు పంపించారు. 12 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు లోకేష్‌ను ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.