
సిట్‌లో భూములుహాంఫట్!
అక్రమాల ‘కేడీ’..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై నిషేధాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘సిట్’ నివేదికలోని భూములపై మాత్రం ఎడాపెడా నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రైవేటుపరం చేస్తోంది. ఇప్పటికే ఎండాడలో రూ.100 కోట్ల విలువైన 5.10 ఎకరాల భూమిపై నిషేధాన్ని ఎత్తివేసి ప్రైవేటు వ్యక్తుల పరం చేసిన కూటమి ప్రభుత్వం.. తాజాగా పరవాడలోని 6.26 ఎకరాలను సైతం ఓ ప్రైవేటు సంస్థ పరం చేసింది. ఈ భూమి విలువ రూ.70 కోట్లకు పైమాటే ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం సిట్‌లో ఫలానా సర్వే నెంబర్లు లేవంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో అపెక్స్ కమిటీ మెమోను చూపించడం గమనార్హం. ఇందుకు అనుగుణంగా అనకాపల్లి జిల్లా కలెక్టరు 6.26 ఎకరాల భూమిపై నిషేధం ఎత్తివేస్తూ గత నెలలో ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా పరవాడలోని దేశపాత్రునిపాలెం పరిధిలోని 360–1, 360–2 సర్వే నెంబర్లలోని 6.26 ఎకరాల భూమి నేరుగా ప్రైవేటు సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ వ్యవహారంలో బీచ్ రోడ్‌లో ఉండే సు‘కుమారు’డు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దీంతోపాటు కొమ్మాది, మధురవాడ, పరవాడలోని మరికొన్ని సర్వే నెంబర్లకు చెందిన భూములపై నిషేధం ఎత్తివేయించేందుకు సదరు వ్యక్తి భారీ స్థాయిలో డీల్స్ కుదుర్చుకున్నట్టు సమాచారం.
● నేరుగా ప్రైవేటు సంస్థకు భూ బదలాయింపు
● భూమి విలువ రూ.70 కోట్లు
● సిట్‌లో లేవని.. అందుకే నిషేధం ఎత్తివేశామంటూ మెలిక
అపెక్స్ కమిటీ పేరుతో అక్రమాలు...!
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్ నివేదికపై అపెక్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అపెక్స్ కమిటీ తమకు అనుకూలమైన సర్వే నెంబర్లను సిట్ నివేదిక నుంచి తప్పించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశపాత్రునిపాలెంలోని 360–1, 360–2 సర్వే నెంబర్లకు చెందిన 6.26 ఎకరాల భూమిని సిట్ నివేదికను తప్పించినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా 2025 ఫిబ్రవరి 14న అపెక్స్ కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో రూపంలో ఆదేశాలు జారీచేసింది. దీని ఆధారంగా అనకాపల్లి కలెక్టర్ పైరెండు సర్వే నెంబర్లలోని భూములపై నిషేధం ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేశారు. అయితే సదరు మాజీ సైనికోద్యోగుల పేరు మీద కాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా గతంలో విక్రయించిన ప్రైవేటు సంస్థ పేరు మీదనే ఉత్తర్వులు జారీచేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సు‘కుమార్’ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పరవాడలో 6.26 ఎకరాలపై నిషేధం ఎత్తివేత
సు‘కుమార’ంగా చక్రం తిప్పేశాడు
దేశపాత్రునిపాలెంలోని 6.26 ఎకరాల భూమిపై నిషేధం ఎత్తివేసేలా చేసిన వ్యవహారంలో బీచ్ రోడ్‌లో ఉండే సు‘కుమార్’ చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ కూడా ఆ భూమిని తిమ్మిని బమ్మిని చేసినందుకుగానూ ఆయాచితంగా లభించిందనే ప్రచారం ఉంది. సదరు వ్యక్తి ఓ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యేకు బినామీగా వ్యవహరిస్తారనే ప్రచారం కూడా ఉంది. అతడి వద్ద మరో రూ.1,000 కోట్ల విలువ చేసే ఫైల్స్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే ద్వారా కీలక మంత్రికి.. తద్వారా చినబాబుకు దగ్గరగా ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్‌లోని భూములకు కూడా చక్రాలు వచ్చి ప్రైవేటువ్యక్తుల పరమవుతుండటం గమనార్హం