చంద్రబాబును గద్దె దించడమే దళితుల లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబును గద్దె దించడమే దళితుల లక్ష్యం

Aug 14 2025 6:42 AM | Updated on Aug 14 2025 6:42 AM

చంద్రబాబును గద్దె దించడమే దళితుల లక్ష్యం

చంద్రబాబును గద్దె దించడమే దళితుల లక్ష్యం

● దళితుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఎం, మంత్రుల వ్యాఖ్యలు ● ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి అయ్యేది జగనే.. ● వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సుధాకర్‌బాబు

విశాఖ సిటీ: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు నిద్రపోయేది లేదని.. అదే దళితుల లక్ష్యమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు. మద్దిలపాలెంలోని జిల్లా వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో జిల్లా ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చంద్రబాబు, మీకెందుకురా రాజకీయాలు, మేము చేసుకుంటాం.. అని ఆ పార్టీ విప్‌ చింతమనేని ప్రభాకర్‌, మంత్రులు సైతం దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పుట్టుకను, చదువును అవమానించిన టీడీపీని వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయడం తథ్యమన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పక్కనపెట్టి.. రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జగన్‌ రూ.2.75 లక్షల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. దళితుల ఆత్మాభిమానం పెరగాలంటే జగన్‌ సీఎం కావాలని తేల్చి చెప్పారు. జైబీమ్‌–జై జగన్‌ నినాదం రాష్ట్రంలో మార్మోగిపోవాలని పిలుపునిచ్చారు. పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వైఎస్సార్‌ సీపీకి, పోలీసులకు మధ్య జరిగాయన్నారు.

● ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దళితులకు రాజ్యాధికారం దక్కిందని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు, వారి ఆస్తుల ఆక్రమణలు, గ్రామ బహిష్కరణలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

● మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మాత్రం రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. అంబేడ్కర్‌ ఆశయ సాధన కు అనుగుణంగా దళితుల సంక్షేమం, అభివృద్ధి కో సం జగన్‌ కృషి చేశారన్నారు. గత ఎన్నికల్లో దళితులు వైఎస్సార్‌ సీపీకి అధికంగా ఓటేశారని గుర్తు చేశారు.

● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జగన్‌ అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రపంచంతో పో టీ పడేవిధంగా ఇంగ్లిష్‌ మీడియంతోపాటు సీబీఎస్‌ సీ సిలబస్‌ను ప్రవేశపెట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని విమర్శించారు.

ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ దళితులపై కక్షపూరితంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. మోసానికి ప్యాంటు, షర్టు వేస్తే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. దళితుల ఆత్మగౌరవ చిహ్నంగా విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన టీడీపీ గూండాలతో రాళ్లు వేయించారని ఆరోపించారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు చిత్తశుద్ధి, సమానత్వ దృక్పథంతో దళిత వర్గాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన నాయకుడు జగన్‌ అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించి దళితులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఇంకా వెయ్యి రోజులు మాత్రమే అధికారంలో ఉంటారని, ఆ తర్వాత జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు.

దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్‌కుమార్‌ జగన్‌ ఒక సింహం అని, సింహానికి పదవి, కిరీటం అవసరం లేదన్నారు. కార్యకర్తలకు చిన్న దెబ్బ తగిలినా 100 రెట్లు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం జైళ్లను బాగు చేసుకోవాలని, ఏసీలు పెట్టుకోవాలని సూచించారు.

తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చింది జగన్‌ మాత్రమే అన్నారు. డిప్యూటీ సీఎం నుంచి కార్పొరేటర్ల వరకు అన్నింట్లోను దళితులకు భాగస్వామ్యం కల్పించారని తెలిపారు.

గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు సంక్షేమం అందకపోగా వారిపై దాడులు జరుగుతుండడం దారుణమన్నారు. జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

సమావేశంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్‌, సిహెచ్‌ వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్‌ కట్టమూరి సతీష్‌, పార్టీ కార్యాలయం ఇన్‌చార్జ్‌ రవిరెడ్డి, రాష్ట్ర పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు బొల్లవరపు జాన్‌ వెస్లీ, పేర్ల విజయ్‌చంద్ర, పార్టీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్‌, రవిరాజు, జహీర్‌ అహ్మద్‌, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు బోని శివరామకష్ణ, జిల్లా పరిశీలకుడు వీరంశెట్టి పూర్ణ చంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెయ్యి వెంకటరమణ, జోనల్‌ విభాగం అధ్యక్షుడు అల్లంపల్లి రాజాబాబు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు చెన్నా జానకిరామ్‌, మార్కట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆల్ఫాకృష్ణ, కార్పొరేటర్లు కె.వి.శశికళ, బళ్ల లక్ష్మణ్‌, జిల్లా అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గండి భాగ్యవతి, ఐ.డి.బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కోన వెంకట శంకర సన్యాసిరావు, ఎడ్ల సిద్ధార్ధ రాజు, ముంజేటి హనుమంతరావు నియోజకవర్గం అధ్యక్షులు మర్దపూడి పరదేశి, పూడి మల్లేశ్వరరావు, ఆకుల శ్యామ్‌కుమార్‌, దొండపర్తి లక్ష్మారావు, బంగారు భవా నీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement