
స్టీల్ మెల్ట్ షాప్–2లో 72 హీట్లతో కొత్త రికార్డు
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ మరో అద్భుతమైన ఘనతను సాధించింది. స్టీల్ మెల్ట్ షాప్– 2 (ఎస్‌ఎంఎస్–2) విభాగంలో మంగళవారం అత్యధికంగా 72 హీట్లను ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. గతంలో 2021 జనవరి 30న సాధించిన 68 హీట్ల రికార్డును ఇది అధిగమించింది. ఈ రికార్డు సాధనలో భాగంగా మూడు షిఫ్టుల్లోనూ 24 చొప్పున మొత్తం 72 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. దీంతో రెండు స్టీల్ మెల్ట్ షాపులలో కలిపి మొత్తం 133 హీట్లు ఉత్పత్తి అయ్యాయి. అంతేకాకుండా మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో కలిపి 19,037 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి కావడం విశేషం. ఈ రికార్డు సాధనలో కృషి చేసిన ఉద్యోగులను స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులు అభినందించారు.
వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో క్లియరెన్స్ సెల్
డాబాగార్డెన్స్: వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు జీవీఎంసీలో సింగిల్ విండో క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నోడల్ అధికారులు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేషకుమార్ 9848308823, సిటీప్లానర్ వి.మీనాకుమారి 8374966777, కార్యనిర్వాహక ఇంజనీర్ డి.శ్రీధర్ 8187898427, అగ్నిమాపక అధికారి బి.కృపావరం 9912448555, అలాగే జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, కార్యనిర్వాహక ఇంజనీర్లను సంప్రదించాలని తెలిపారు.