
స్వాతంత్య్ర దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
బీచ్‌రోడ్డు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరగనున్న వేడుకల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఆయన తుది సమీక్ష చేపట్టారు. ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకుని.. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. శకటాలు, స్టాళ్లు, సీటింగ్ ఏర్పాట్లలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. వర్షం వచ్చినా కార్యక్రమానికి అంతరాయం కలగకుండా వాటర్‌ప్రూఫ్ టెంట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వేడుకలకు వచ్చే అతిథులకు, సాధారణ పౌరులకు సీటింగ్, తాగునీటి ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు. పైలట్ వాహనాన్ని ముందుగానే తనిఖీ చేసి, ట్రయల్ రన్ వేసి సిద్ధంగా ఉంచాలన్నారు. స్టేజీ డెకరేషన్, శానిటేషన్, సర్టిఫికెట్ల తయారీ, జ్ఞాపికల రూపకల్పన వంటి పనులను పూర్తి చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, పాటల నిడివి తగ్గించాలని జేసీ సూచించారు. సమావేశంలో డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కాగా.. రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ మేరకు రాష్ట్ర పరిపాలన విభాగం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.