
లోన్ యాప్‌లను నమ్మవద్దు
● పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ● నిందితుల నుంచి రూ.48 లక్షల రికవరీ ● బాధితులకు తిరిగి సొమ్ము అందజేత
అల్లిపురం: సైబర్ మోసాలపై పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. చాలామంది ఇంకా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. నగర ప్రజలు లోన్ యాప్‌లను నమ్మవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం లోన్ యాప్‌ల బాధితులకు నిందితుల నుంచి రికవరీ చేసిన రూ.48 లక్షలను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లోన్ యాప్ కేసులో సీజ్ చేసిన క్రిప్టో కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చినట్లు చెప్పారు. ఈ మోసాల్లో బాధితులైన 295 మందిని గుర్తించామని, వారిలో దాదాపు వంద మంది ఎక్కువ మొత్తంలో డబ్బు నష్టపోయారని సీపీ వివరించారు. నిందితుల నుంచి రికవరీ చేసిన రూ.48 లక్షలను చట్టపరమైన ప్రక్రియల ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇన్స్టెంట్ లోన్ యాప్‌ల నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేని యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని ఆయన సూచించారు. సైబర్ నేరగాళ్లు ఇచ్చే కమిషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వడం, లేదా వాటిని సరఫరా చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.