‘ఆత్మనిర్భర్ భారత్‌కు అనుగుణంగా వృద్ధి సాధించాలి’
సీతంపేట: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సహాయ మంత్రి శంతను ఠాకూర్ బుధవారం సీతమ్మధారలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్( డీసీఐఎల్) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. డీసీఐఎల్ అన్ని విభాగాల అధిపతులతో సమావేశమయ్యారు. పోర్టు అభివృద్ధికి మద్దతు, డ్రెడ్జింగ్ కార్యకలాపాల ద్వారా దేశవ్యాప్తంగా నావిగేషన్ చానళ్ల నిర్వహణలో సంస్థ కృషిని అభినందించారు. ఆత్మ నిర్భర్ భారత్ చొరవకు అనుగుణంగా అభివృద్ధిని ప్రోత్సహించాలని డీసీఐఎల్‌ను కోరుతూ, ఎంఎస్‌ఎంఈలు, స్థానిక విక్రేతలకు సాధికారత కల్పించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. డీసీఐఎల్ చైర్మన్ మధయ్యన్ అంగముత్తు మాట్లాడుతూ సంస్థ వ్యూహాత్మక కార్యక్రమాలు, మేజర్, మైనర్ పోర్టులలో డ్రెడ్జింగ్ మౌలిక సదుపాయాల బలోపేతంలో డీసీఐఎల్ పాత్రను విశదీకరించారు. సంస్థ సీఈవో దుర్గేష్ కుమార్ దూబే, కెప్టెన్ ఎస్.దివాకర్‌లు సంస్థ ఆర్థిక ప్రగతిని వివరించారు. అనంతరం మంత్రి ఠాకూర్‌ను ఘనంగా సత్కరించారు.


