పిల్లర్‌ దాటితే ఒట్టు! | - | Sakshi
Sakshi News home page

పిల్లర్‌ దాటితే ఒట్టు!

Nov 25 2026 11:05 AM | Updated on Nov 25 2026 11:05 AM

రెండున్నరేళ్ల క్రితం రూ.78 కోట్లతో పనులు అలైన్‌మెంట్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు 110 గజాల స్థలం, రూ.15 లక్షల పరిహారం కోరుతున్న బాధితులు

తాండూరు: పట్టణంలోని పాత తాండూరు రైల్వే గేట్‌ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ పనులు పిల్లర్‌ దశ వీడటం లేదు. రూ.78 కోట్ల వ్యయంతో 939 మీటర్ల పొడవున నిర్మించ తలపెట్టిన వంతెన పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది.2024లో అట్టహాసంగా ప్రారంభించిన పనులు రెండున్నరేళ్లు కావస్తున్నా ఆశించిన పురోగతి సాధించలేదు. ఇప్పటి వరకు కేవలం 11 పిల్లర్లు మాత్రమే నిర్మించి వదిలేశారు. భూములు, ఇళ్లు ఇచ్చేందుకు యజమానులు ముందుకు రాకపోవడంతో నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

స్థలాలు సేకరించకుండానే..

పాత తాండూరు వైపు 15 పిల్లర్లు, పాదచారులు రైలు పట్టాల పైనుంచి రోడ్డుకు అటువైపు వెళ్లడానికి(ఒక అపార్ట్‌మెంట్‌) 351 మీటర్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రైల్వే గేటు నుంచి మార్వాడి బజార్‌, రైల్వే స్టేషన్‌ ఎదుట ఉన్న మోడల్‌ రోడ్డు నుంచి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వరకు 23 పిల్లర్లు, 588 మీటర్ల పొడవైన వంతెన ఒక అపార్ట్‌మెంట్‌ నిర్మించాల్సి ఉంది. మొత్తం 38 పిల్లర్లు, రెండు అపార్ట్‌మెంట్‌లతో వంతెన నిర్మించాలి. అయితే నిర్మాణానికి అవసరమైన స్థలాలను సేకరించకుండా ఆర్‌అండ్‌బీ అధికారులు వంతెన పనులను ప్రారంభించారు.

భూ సేకరణలో అడ్డంకులు

వంతెన నిర్మాణ మార్గంలో పాత తాండూరు ప్రాంతంతో పాటు రైల్వే స్టేషన్‌ మార్వాడి బజార్‌ వైపు అనేక నివాస గృహాలు, దుకాణాలు ఉన్నాయి. వీటి యజమానులు తమ భూములు, ఇళ్లను వదులుకునేందుకు ఇష్టపడటం లేదు. రెండేళ్లుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

ప్రధాన ప్రాంతాలన్నీ వంతెన కిందికే..

ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయితే పట్టణంలోని కీలక ప్రాంతాల రూపురేఖలు మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన కిందకు వెళ్లే ప్రాంతాల్లో ఇళ్లు, దుకాణాలు ఉండటంతో సహజ కాంతి, గాలి రాకపోకలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. తగిన ప్రణాళిక లేకపోతే వంతెన కింత ప్రాంతాలు నిరుపయోగంగా మారి మురికివాడలను తలపించే పరిస్థితి ఏర్పడవచ్చనే అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న వ్యాపార సముదాయాలకు రాకపోకలు, రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు సైతం వంతెన వల్ల ట్రాఫిక్‌ కష్టాలు ఎదురవుతాయని తెలిపారు.

వంతెన పూర్తయ్యేనా?

పట్టణంలోని రైల్వే గేట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపాల్సిన ఈ ప్రాజెక్టు రెండేళ్లుగా నత్తనడక సాగుతోంది. దీంతో ప్రజా ధనం వినియోగంపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. భూ సేకరణ సమస్యను పరిష్కరించకుండా మిగిలిన పనులు ఎలా పూర్తి చేస్తారన్నది అంతుచిక్కడం లేదు. బాధితుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని పరిహారం ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌ నిర్మాణం వల్ల కలిగే ప్రభావాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇళ్లు, భూములు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 110 చదరపు గజాల స్థలంతో పాటు ఒక్కో కుటుంబానికి రూ.10 నుంచి రూ.15 లక్షల పరిహారం అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే ఇప్పటికే నిర్మించిన పిల్లర్లు నిరుపయోగంగా మిగిలే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం మూడు నెలలుగా బ్రిడ్జి నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు నిలిపివేయడం గమనార్హం. ఏడాది కాలం పాటు మూసి ఉన్న రైల్వే గేట్‌ పనులను నిలిపి వేయడంతో గుంతలను పూడ్చి మళ్లీ వాహనాల రాకపోకలు జరిగేలా సిద్ధం చేశారు.

అరగంటకోసారి..

పాత తాండూరు రైల్వే గేటు అరగంటకోసారి వేస్తున్నారు. రైలు వెళ్లే దాకా దాదాపు 15 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సమయం వృథా అవుతోంది. వంతెనను వెంటనే పూర్తి చేయాలి.

– మహబూబ్‌ ఖురేషి, తాండూరు

నత్తనడకన ఫ్లైఓవర్‌

వంకరటింకరగా..

వంతెన నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాం. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమా వేశంలో ఆమోదం తెలిపాం. బాధితులకు న్యా యం చేయాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వంతెనను వంకరటింకరగా నిర్మిస్తున్నారు.

–బొబ్బిలి శోభారాణి,మాజీ కౌన్సిలర్‌,తాండూరు

న్యాయం చేయాలి

రైల్వే వంతెన నిర్మాణంతో ఇళ్లు, స్థలాలు కోల్పో తున్న వారికి న్యాయం చే యాలి. ఇందు కోసం పోరాటం చేస్తున్నాం. కానీ ఎవరూ స్పందించడం లేదు. ఒక్కో బాధితుడికి 110 చదరపు గజాల స్థలం, రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి.

– శివకుమార్‌, అంబేడ్కర్‌ నగర్‌, తాండూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement