లాభాపేక్ష తప్ప రోగుల ఆరోగ్యం పట్టని వైనం సరైన వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు వారం రోజుల క్రితంవైద్యం వికటించి బాలిక మృతి ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు విచారణ పేరుతో వసూళ్ల దందా
పరిగి: పట్టణంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్య సేవలపై ఆందోళన వ్యక్తమవుతోంది. చికిత్స కోసం వస్తున్న రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారం రోజుల క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో వైద్యం వికటించి 17 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన కలకలం రేపింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తమ పాప చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే బాధితులతో రాజీ చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తన్నాయి. తరచూ ఇలా ఏదో ఒక ఆస్పత్రిలో ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల, ఆస్పత్రుల నిర్వాహకుల మధ్య ఒప్పందాల కారణంగానే మెడికల్ మాఫియా జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పర్యవేక్షణ కరువు
పరిగి పట్టణంలో ప్రైవేటు ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దాదాపు 30కిపైగా ఉన్నాయి. మల్టీ స్పెషలీస్టుల పేరుతో ప్రజలను కొన్ని ఆస్పత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. రోగులకు అందుతున్న వైద్య సేవలు, వైద్యుల అర్హతలు, అత్యవసర చికిత్స సౌకర్యాలు, ఆస్పత్రుల నిర్వహణను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన అధికారులు వాటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏదైన ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం మినహా, ముందస్తు తనిఖీలు నిర్వహించి లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వైద్యం పేరిట లక్షలు వసూలు చేసే ప్రైవేటు ఆస్పత్రులు మెరుగైన చికిత్స అందించడంలో విఫలమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ఓ ఆస్పత్రిలో బాలిక మృతి చెందిన ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు. అసలు బాలికకు ఏ వైద్యం అందించారు, చికిత్సలో ఏమైన లోపాలు జరిగాయా, అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్య సేవలు అందించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేసి అందినకాడికి తీసుకెళ్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నయి.
చర్యల ఊసే లేదు
ఓ వైపు ప్రైవేటు ఆస్పత్రుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, మరో వైపు వైద్య సేవల నాణ్యతపై ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. చికిత్స సమయంతో చోటు చేసుకుంటున్న మరణాలకు గల కారణాలను నిష్పక్షపాతంగా విచారించాల్సి న బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఉంటుంది.బాధితుల ఫిర్యాదులను పరిశీలించి, వైద్య సేవల్లో నిర్లక్ష్యం రుజువైతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. పరిగిలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా మరణాలు జరిగాయి. డాక్టర్ల నిర్లక్ష్య కారణంగానే మృతి చెందారని బాధితులు ఆస్పత్రుల ముందే ధర్నాలు, ఆందోళనలు చేపట్టినా ఇప్పటి వరకు ఏ ఒక్క ఆస్పత్రిపై చర్యలు తీసుకోకపోవడం గమర్హం. ఆస్పత్రుల నిర్వాహకులు, అధికారుల సమన్వయంతోనే ప్రైవేటు హాస్పిటల్స్ కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే చర్యలు ఉండటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు బలం చేకూరుస్తోంది.


