అనంతగిరి: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. పింఛన్ల మంజూరు, వీబీజీరామ్‌జీ పనులపై బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శకంగా పింఛన్ల మంజూ రు ప్రక్రియ చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. అనర్హులకు పథకం అమలైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వికలత్వంపై ఏమైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు.
భూగర్భ జలాల పెంపునకు చర్యలు
నీటి కుంటలు, బోర్‌వెల్ రీచార్జ్, ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించడం, భూగర్భ జలమట్టాన్ని పెంచడం, వర్షపు నీటిని సంరక్షించడం లక్ష్యంగా వీబీజీరామ్‌జీ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, జెడ్పీ సీఈఓ సుధీర్, అదనపు డీఆర్‌డీఓ నర్సింలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
భూముల రీ సర్వేకు..
జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం నగరం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూముల రీ సర్వే పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియ సమర్థవంతంగా సాగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, తాండూరు, వికారాబాద్ ఆర్‌డీఓలు అనిత, వాసుచంద్ర, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్ పాల్గొన్నారు.
పింఛన్ల మంజూరు పారదర్శకంగా నిర్వహించాలి
కలెక్టర్ దీపక్ తివారి


