చిట్టితల్లికి పెద్ద జబ్బు | - | Sakshi
Sakshi News home page

చిట్టితల్లికి పెద్ద జబ్బు

Nov 12 2026 11:42 AM | Updated on Nov 12 2026 11:42 AM

కుల్కచర్ల: ఎంతో సంతోషంగా సాగాల్సిన బాల్యం అనారోగ్యం కారణంగా ఆస్పత్రి మంచానికే పరిమితమైంది. ఎనిమిదేళ్ల వయస్సులోనే ఓ చిన్నారి తీవ్రమైన (రిఫ్రాక్టరీ స్టేటస్‌ ఎపిలెప్టికస్‌) అనారోగ్య సమస్యతో బాధపడుతూ నగరంలో చికిత్స పొందుతోంది. సాధారణ జీవనమే కష్టంగా సాగే ఓ ఆటో డ్రైవర్‌ కుటుంబం తన కూతురిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. పేదరికం వారికి అడుగడుగునా అవాంతరాలను సృష్టిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. చిన్నారి జనని మెదడు – నాడీ సంబంధిత సమస్యతో పోరాడుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లికి చెందిన ఈడిగి నర్సింలు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కూతురు జనని(8) స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఓ రోజు ఉన్నట్టుండి జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. కొంత ఇబ్బందికరంగా ఉండటంతో పలు ఆస్పత్రుల్లో చూపారు. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రిఫ్రాక్టరీ స్టేటస్‌ ఎపిలెప్టికస్‌ అనే అనారోగ్య సమస్య నుంచి కోలుకోవాలంటే కొంత సమయం పడుతుందని, వైద్యం కోసం సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని డాక్టర్లు తండ్రి ఈడిగి నర్సింలుకు సూచించారు. పేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కూతురిని ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే వారు ఫోన్‌ నంబర్‌ 9121812551లో సంప్రదించవచ్చని కోరారు. రెండు రోజుల క్రితం బాలిక కుటుంబ సభ్యులు పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కూతురి వైద్యం కోసం సాయం చేయాలని కోరారు. స్పందించిన కేటీఆర్‌ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మెదడు – నాడీ సంబంధిత సమస్యతో పోరాడుతున్న జనని

నగరంలో చికిత్స పొందుతున్న బాలిక

ఆపన్నహస్తం కోసం కుటుంబసభ్యుల ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement