సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విలువైన యూజీ, ఏబీ కేబుల్స్, స్విచ్‌లు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లే కాదు సాధారణ విద్యుత్ స్తంభాలు సైతం దొరకడం లేదు. నిర్దేశించిన ఫీజులు చెల్లించి కొత్తలైన్లు, కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో డిమాండ్‌కు తగినన్ని విద్యుత్ స్తంభాలు అందుబాటులో లేకపోవడంతో ఇంజనీర్లు ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులే వీటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఔటర్‌కు అటు ఇటుగా అనేక కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. కొత్త వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు పుట్టుకొస్తున్నాయి. పాత జీపీ లే అవుట్లలో ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేపడుతున్నారు. ముందస్తుగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ప్లాట్‌కు సమీపంలో లైన్లు లేకపోవడంతో సమీపంలోని స్తంభాల నుంచి కొత్తగా వేసుకోవాల్సి వస్తోంది.
విస్తరణ పనులకు విఘాతం
ప్రస్తుతం గ్రేటర్ జిల్లాల పరిధిలో 65 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 53 లక్షలకుపైగా గృహ, ఎనిమిది లక్షలకుపైగా వాణిజ్య, రెండు లక్షలకుపైగా పారిశ్రామిక, వీధిలైట్లు ఇతర కనెక్షన్లు ఉ న్నాయి. వీటికి అదనంగా ప్రతి నెలా 35 వేల కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతుంటాయి. మెజార్టీ దరఖాస్తులు శివారు ప్రాంతాల నుంచే వస్తుంటాయి. పాత జీపీ లే అవుట్లలో విద్యుత్ లైన్లు లేకపోవడంతో వినియోగదారులే వాటిని స్వయంగా సమకూర్చుకోవాల్సి వస్తోంది. కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత జేఎల్ఎం, లైన్ ఇన్స్పెక్టర్, ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించి సమీపంలోని సబ్‌స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కొత్తగా స్తంభాలు వేసుకోవాల్సి వస్తోంది. ఈ మేరకు ఇంజనీర్లు అంచనాలు రూపొందించి ఇస్తుంటారు. ఇంజనీర్లు నిర్దేశించిన ఫీజులను వినియోగదారుల డిస్కంకు డీడీ రూపంలో చెల్లిస్తుంటారు. తర్వాత ఆయా లైన్ల విస్తరణ పనులను గుర్తింపు పొందిన కాంట్రాక్టర్‌కు అప్పగించి, లైన్లు, కనెక్షన్ల జారీ వంటి పనులు పూర్తి చేయించాల్సిన బాధ్యత డిస్కంపై ఉంది. డిస్కం వద్ద డిమాండ్ మేర స్తంభాలు లేకపోవడంతో విస్తరణ పనులకు విఘాతం ఏర్పడుతోంది. ప్రస్తుతం డిస్కం మొత్తానికి ఒకే తయారీ సంస్థ (8.5, 9.1, 11 మీటర్ల ఎత్తు) స్తంభాలను సరఫరా చేస్తోంది. సదరు సంస్థకు డిస్కం ఇప్పటికే భారీగా బకాయిలు పేరుకుపోవడానికి తోడు కొత్త మెటీరియల్ కొనుగోలుకు టెండర్లు పిలువకపోవడమే కొరతకు కారణమని తెలిసింది. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు. అప్పటికే డిస్కంకు చెల్లించిన డీడీ డబ్బులు కూడా తిరిగివ్వడం లేదు.
మీటర్లే కాదు.. విద్యుత్ స్తంభాలూ కరువే
డిస్కంలో కొత్తలైన్లు, కనెక్షన్లకు తప్పని తిప్పలు
శివారు ప్రాంతాల్లో రోజుల తరబడి ఎదురుచూపులు


