షాబాద్: విద్యుత్ షాక్‌తో కాడెద్దు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఎర్రోనిగూడలో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు కొలన్ వెంకట్‌రెడ్డి కాడెద్దు శనివారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో మేత మేస్తుండగా షాక్ తగిలి మృత్యువాత పడింది. వ్యవసాయ పనులకు ఆ ఎద్దుపైనే ఆధారపడినట్లు, సుమారు రూ.లక్ష నష్టం జరిగినట్టు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
షాద్‌నగర్‌రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన షాద్‌నగర్ పట్టణ శివారులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. షాబాద్ మండలం బోడంపాడ్ గ్రామానికి చెందిన చిన్న వెంకటయ్య (40) శనివారం ఉదయం తన కారులో షాద్‌నగర్ వస్తున్నాడు. పట్టణ శివారులోని గ్రానైట్ పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న చిన్న వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భాస్కర్‌కు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సీతారాం తెలిపారు. చిన్న వెంకటయ్య కారులో మద్యం సీసాలు ఉండడంతో మద్యం తాగి కారును నడిపించినట్లు భావిస్తున్నారు. మద్యం మత్తులో అదుపు తప్పి బైకును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
ఫిలింనగర్: జీతం తీసుకునేందుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాని సంఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లాకు చెందిన నరసమ్మ (45) ప్రస్తుతం షేక్‌పేట మారుతీనగర్‌లో ఉంటూ పని చేసుకుంటోంది. ఆమెకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు అంజి (18) ఉన్నారు. ఈ నెల 3న అంజి తన జీతం తీసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. అయితే సాయంత్రమైన తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. తల్లి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన లేదు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అబిడ్స్: అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్, గోషా మహాల్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మహేష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... బేగంబజార్ పరిధి చుడిబజార్‌లో ఓ ఇంట్లో లైసెన్స్ లేకుండా దాదాపు రూ.20 లక్షల విలువైన టపాసుల ను నిల్వ ఉంచడంపై స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో దాడులు నిర్వహించి 569 కార్టన్ల సరుకును స్వాధీనం చేసుకుని గోషామహాల్ పోలీసులకు అప్పగించారు. రద్దీగా ఉండే చుడీ బజార్‌లో అక్రమంగా గోదాంను ఏర్పాటు చేసిన యజమానిపై కేసు నమోదు చేశారు.


