వికారాబాద్: ఈ ఏడాది వరి సాగుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. వర్షాకాలంలో వచ్చిన మార్పులతో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతుందనుకుంటే ఇప్పటికే లక్ష ఎకరాలు దాటింది. వానలు పడక పోతాయా..? చెరువులు నిండకపోతాయా..? భూగర్భజలాలు పెరగకపోతాయా..? బోరుబావుల్లో నీరు రాకపోతుందా..? తమ పంటలు పండక పోతాయా..? అనే ఆలోచనతో దేవుడిపై భారం వేసి పోసుకున్న నారుమళ్ల ఎండిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చెరువులు పూర్తిగా అడుగంటుతుండటం, బోరుబావుల్లో నీరు గణనీయంగా తగ్గుతుండటంతో వరి పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మరో పక్క కరెంటు కోతలు కలవర పెడుతున్నాయి.
లక్ష ఎకరాలు దాటిన సాగు
జిల్లాలో అత్యధికంగా ధారూరు, బొంరాస్పేట్, దౌల్తాబాద్, దుద్యాల, యాలాల మండలాల్లో వరి పంట వేశారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1.04 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఎల్నినో ప్రభావం, చెరువుల్లోకి నీరు చేరకపోవడం వంటి కారణాలతో సాగు విస్తీర్ణం తగ్గుతుందని అధికారులు భావించారు. కానీ అంచనాలను మించి సాగైంది. జిల్లాలో 1,187 చెరువులు ఉండగా చాలా వరకు నిండలేదు. భూగర్భ జలాలు సైతం పెరగలేదు. జిల్లాలోని 20 మండలాల్లో కేవలం 8 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు వరి సాగు వద్దంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులకు అవగాహన కల్పించారు. అయితే ఎప్పటిలాగే అన్నదాతలు వరి వైపే మొగ్గు చూపారు.
వర్షాకాలం ముగుస్తున్నా..
వానాకాలం సీజన్ ముగుస్తున్నా వరుణుడు కరుణించలేదు. సాగుకు సరిపడా వర్షాలు పడలేదు. దీంతో వరి నాట్లు వేసుకున్న రైతులు అయోమయానికి గురవుతున్నారు. గతేడాది సెప్టెంబర్ చివరి వరకు భాదీ వర్షాలు పడ్డాయి. ఈ సారి కూడా కురుస్తాయని రైతులు భావించారు. దేవునిపై భారం వేసి పంట సాగు చేశారు. నాట్లు వేసే సమయంలో చెరువుల్లో నీరు ఉంది. ప్రస్తుతం అడుగంటింది. బోరుబావుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి వరి సాగు విస్తీర్ణం కాస్త తగ్గినా లక్ష ఎకరాలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. పంట పూర్తయ్యే వరకు నీరు అందించడం సాధ్యమేనా అనే ఆలోచనలో అన్నదాత ఉన్నాడు. పరిగి వ్యవసాయ డివిజన్లో అత్యధికంగా 37,876 ఎకరాల్లో వరి పంట వేశారు. ఆ తర్వాత కొడంగల్ డివిజన్లో 36,137 ఎకరాల్లో, తాండూరు డివిజన్లో 22,964 ఎకరాల్లో, వికారాబాద్ డివిజన్లో 7,023 ఎకరాల్లో వరి సాగు చేశారు.
ధారూరులో ఎండుతున్న వరి పంట
జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 1.04లక్షల ఎకరాలు
పంటపై ఎల్నినో ప్రభావం
ఎన్నడూ లేనంతగా లోటు వర్షపాతం
పాతాళంలో భూగర్భ జలాలు
ఎండిపోతున్న బోరుబావులు
అడుగంటుతున్న చెరువులు, కుంటలు
ఆందోళనలో అన్నదాతలు
జిల్లాలో పంటల సాగు ఇలా.. (ఎకరాల్లో..)
పత్తి 2,43,872
వరి 1,04,000
కంది 1,07,220
సోయాబీన్ 1,701
మొక్కజొన్న 42,175
జొన్న 619
మినుము 1,722
జీలుగ 380
పెసర 10,632
చెరుకు 1,861
జనుము 1,752


