తాండూరు టౌన్: దసరా వేడుకలకు హాజరు కావాలని మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు ఆహ్వానించారు. ఈనెల 20వ తేదీ సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జమ్మి పూజ, రావణవధ కార్యక్రమాలకు హాజరు కావాలని సమితి ప్రధాన కార్యదర్శి బిర్కట్ రఘు, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, రాజుగౌడ్, కిరణ్, వెంకటేష్ తదితరులు కోరారు.
అనంతగిరి: బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి గురువారం నగరంలో కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా అభివృద్ధి, పార్టీ పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలిసింది.
తాండూరు: బుక్ మై డ్రోన్ యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సీ సుధారాణి సూచించారు. గురువారం ఏడీఏ అరుణ, శాస్త్రవేత్తలతో కలిసి ఇలా అగ్రి సంస్థ రూపొందించిన బుక్ మై డ్రోన్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్రోన్ ద్వారా పురుగు మందు పిచికారీ సులవన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మండల అధికారులు శ్వేత, అనిత, ఇలా అగ్రి డైరక్టర్లు రాఘవేంద్రరాజు, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బంట్వారం: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కోట్‌పల్లి మండలం నాగసాన్‌పల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ శైలజ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంజీవయ్య, సుశీల దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. అయితే ఆస్తి మొత్తం పెద్ద కూతురు చంద్రకళకు ఇవ్వాలని తండ్రి సంజీవయ్య పట్టుపట్టాడు. ఇందుకు భార్య సుశీల ఒప్పుకోలేదు. ఇద్దరికీ సమానంగా ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో గొడవల జరిగాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుశీల(52) ఆత్మహత్య చేసుకుంది. భర్త సంజీవయ్య, పెద్ద కూతురు చంద్రకళ వేధింపుల కారణంగానే తమ అక్క ఆత్మహత్య చేసుకుందని సోదరుడు ఎర్రోళ్ల రాములు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
అనంతగిరి: జిల్లాలో ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన పలువురికి ఎస్పీ స్నేహ మెహ్ర అభినందనలు తెలిపారు. గురువారం ఎస్ఐలుగా పదోన్నతి పొందిన మహ్మద్ అంజద్, సంజీవ్, శ్రవణ్‌కుమార్, నారాయణ, అంబదాసు ఎస్పీని జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.


