పనుల్లో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

పనుల్లో వేగం పెంచండి

Oct 16 2026 10:40 AM | Updated on Oct 16 2026 10:40 AM

అనంతగిరి: వీబీజీరామ్‌జీ పథకం పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం వికారాబాద్‌ మండలం గోధుమగూడ గ్రామంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు పనులను పరిశీలించారు. అంతకుముందు గ్రామంలో చేపట్టిన ఫామ్‌ పాండ్స్‌, బోర్‌వెల్‌ రీచార్జ్‌ పనులు, పైకప్పు నీటి సేకరణ, వ్యక్తిగత, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి కొరతను నివారించవచ్చని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్‌ పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వీబీజీరామ్‌జీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పని సరి అన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. వికారాబాద్‌ మండలానికి 72 ఫామ్‌ పాండ్స్‌, 47 బోర్‌ వెల్‌ రీఛార్జ్‌, 16 పైకప్పు నీటి సేకరణ, 119 వ్యక్తిగత, 33 సామూహిక ఇంకుడు గుంతలు మంజూరైనట్లు పేర్కొన్నారు. వాటిని సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ సుధీర్‌, ఎంపీడీఓ వినయ్‌ కుమార్‌, ఉపాధి హామీ ఈసీ నవీన్‌ కుమార్‌, సర్పంచ్‌ స్వర్ణలత, పంచాయతీ కార్యదర్శి ఇందిర తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు కృషి

వైద్య కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం తోపాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులకు సూచించారు. గురువారం అనంతగిరిగుట్టలోని వైద్య కళాశాలను అదనపు కలెక్టర్‌ వెంకటాచారితో కలిసి సందర్శించారు. వసతి గృహం, కిచెన్‌ షెడ్లు, వివిధ మరమ్మతు పనులకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ దీన్‌ దయాల్‌ బంగ్‌, ప్రభుత్వ జ నరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబోద్‌ కుమార్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందంగా పేర్చిన బతుకమ్మలను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. వేడుకల్లో అదనపు కలెక్టర్‌ వెంకటాచారి, ట్రైనీ కలెక్టర్‌ సచిన్‌ బస్వరాజ్‌ గుటుర్‌, డీఆర్‌డీఏ శ్రీనివాస్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ సత్తార్‌, డీపీఓ జయసుధ, డీపీఆర్‌ఓ చెన్నమ్మ, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌ లాల్‌, ఏఓ ఫర్వీహీన బేగం, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

నీటి కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement