యాలాల: మండలంలోని దౌలాపూర్ శివారులో యాలాల పీఏసీఎస్ నిధులతో చేపట్టిన రైసుమిల్లు నిధుల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్ నాయకులు మౌనం వీడి, మండల రైతులకు న్యాయం చేయాలని పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ వడ్డే రాములు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం చెన్నారం మాజీ సర్పంచ్ అరవింద్‌కుమార్, బీఆర్‌ఎస్ యూత్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, మెట్లి కృష్ణ, శ్రీనివాస్, విక్రాంత్, శ్రీశైలం తదితరులతో కలిసి నిరుపయోగంగా మారిన మిల్లును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతుల సొమ్ము రూ.కోట్లు ఖర్చు పెట్టి చేపట్టిన రైసుమిల్లు ప్రస్తుతం నిరుపయోగంగా మారిందన్నారు. మిల్లులో ఎలాంటి మిషనరీ ఏర్పాటు చేయనప్పటికి, సొసైటీ నుంచి రూ.54 లక్షలు కాంట్రాక్టరుకు చెల్లించడంపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ఈ విషయం అప్పటి పీఏసీఎస్ చైర్మన్‌తో పాటు ప్రస్తుత ఎమ్మెల్యేకు తెలుసని.. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అండదండలతో సొసైటీ మిల్లు కుంభకోణం తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. ఏర్పాటు చేయని మిషనరీ రైసుమిల్లుకు ఇప్పటికే సొసైటీ నుంచి మూడు కిస్తులు చెల్లించారన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఇప్పటికే డీసీఓ, కలెక్టర్‌కు సమర్పించామన్నారు. కాగా దౌలాపూర్ శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రెటెడ్ పాఠశాల నిర్మాణం చేస్తున్నామని అధికార కాంగ్రెస్ నాయకులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే చేతుల మీదుగా 15 నెలల క్రితం పాఠశాల నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం తప్ప అక్కడ ఏమీ లేదన్నారు. పాఠశాల పేరిట దర్జాగా పట్టపగలే మొరం వ్యాపారం సాగుతోందన్నారు. ఇదంతా కాంగ్రెస్ నాయకులకు సైతం తెలుసన్నారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు.
పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ రాములు


