రిసార్ట్‌పై పోలీసుల దాడులు | - | Sakshi
Sakshi News home page

రిసార్ట్‌పై పోలీసుల దాడులు

Oct 3 2026 7:24 AM | Updated on Oct 3 2026 7:24 AM

రిసార్ట్‌పై పోలీసుల దాడులు ఆర్థిక ఇబ్బందులతో ట్రాన్స్‌జెండర్‌ ఆత్మహత్య ఆర్టీసీ కార్మికుల కోసం నిరంతర పోరాటం డీసీసీ అధ్యక్షురాలికి సన్మానం

అనంతగిరి: వికారాబాద్‌ మండల పరిధిలోని గోధుమగూడ పరిసర ప్రాంతంలోని విచిక రిసార్ట్‌పై శుక్రవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. గాంధీ జయంతి రోజున మాంసం, మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేశారు. ఈసమయంలో ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాన్ని గమనించారు. చికెన్‌, మటన్‌ ముక్కలు కుళ్లిపోయి కనిపించాయన్నారు. ఈ దాడుల్లో డీఎస్పీ అంజయ్య, సీఐ రఘుకుమార్‌ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రాజేంద్రనగర్‌: పీరం చెరువు పెబల్‌ సిటీలో పరిగి ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ ఈర్ల అంజలి నివసిస్తోంది. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో అంజలి సతమతమవుతోంది. ఇదే విషయమై గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో తన స్నేహితురాలికి ఫోన్‌ చేసి తన ఆర్థిక పరిస్థితి వివరించింది. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఈ విషయాన్ని పరిగిలోని అంజలి తల్లికి స్నేహితురాలు సమాచారం చేరవేసింది. హుటాహుటిన తల్లి అంజలి నివాసానికి చేరుకొని రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు పంచనామ నిర్వహించి మతదేహాన్ని ఉస్మానియా మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ ఎన్నికల్లో టీడబ్ల్యూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ కూటమిని గెలిపించాలి ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం డిపో వద్ద శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సుదీర్ఘకాలం పోరాటం చేశామని గుర్తు చేశారు. ఉద్యోగుల హక్కులతోపాటు సంస్థ పరిరక్షణకు సీఐటీయూ పోరాడిందన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి కూటమి కృషిచేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలకు, సంస్థ విస్తరణకు ముప్పు వాటిల్లిందని ఆరోపించారు. ఆర్టీసీలోని అన్ని కేటగిరీల్లో పని భారం, వేధింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ బస్సులను ఆర్టీసీ నేరుగా కొనుగోలు చేయాలన్నారు. 8 గంటల పని దినాన్ని, ట్రాఫిక్‌ సెక్షన్లు అమలు చేసేవిధంగా, మహిళా కార్మికులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో కాకుండా రెగ్యులర్‌ ప్రాతిపదికన రిక్రూట్‌మెంట్‌ చేసేందుకు కూటమి కృషిచేస్తుందని తెలిపారు. బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి.రవీందర్‌రెడ్డి, రీజినల్‌ సెక్రటరీ ఎస్‌.కృష్ణ, జోనల్‌ ప్రెసిడెంట్‌ ప్రకాశ్‌, రాష్ట్ర కార్యదర్శి జీఆర్‌ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జీఆర్‌ చందర్‌, డిపో ప్రెసిడెంట్‌ టీఎస్‌ రెడ్డి, డిపో కార్యదర్శి ఎంసీ జంగయ్య, సీఐటీయూ మున్సిపల్‌ కార్యదర్శి సీహెచ్‌ ఎల్లేష్‌, మండల కన్వీనర్‌ జగన్‌, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

చేవెళ్ల: కాంగ్రెస్‌ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిని శుక్రవారం చేవెళ్ల, తాండూరు ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మనోహర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. జిల్లా అధ్యక్షురాలి బాధ్యతలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement