సాక్షి, రంగారెడ్డిజిల్లా: భూభారతి డిజిటల్ పోర్టల్‌లోని లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. బాధితుల దరఖాస్తులు, క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చిన నివేదికలు, తహసీల్దార్లు, కలెక్టర్ల వేలిముద్రలు లేకుండానే ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పేరున నమోదవుతున్నాయి. గుట్టుగా పట్టాదారు పాసు పుస్తకాలు సైతం మంజూరవుతున్నాయి. తీరా విషయం బయటికి వచ్చిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు శ్రీపోర్టల్‌శ్రీ లాగిన్‌కు వేసిన తాళాలు తెరిచి తమ సంతకాలను ఎవరో ఫోర్జరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, ఆమనగల్లు, బాలాపూర్‌లో విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన అధికారులు.. తాజాగా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో 4.35 ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. యాచారం మండలం నందివనపర్తిలోని ఓ పట్టా భూమికి తప్పుడు రికార్డులు సృష్టించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోగా, స్వయంగా జిల్లా ఉన్నతాధికారులే వెనకేసుకొస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాచారం మండలం నందివనపర్తి రెవెన్యూ సర్వే నంబర్ 361/అలో 5.11 ఎకరాలు, సర్వే నంబర్ 361/ఆలో 3.18 ఎకరాల పట్టా భూమి ఉంది. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూమికి వాస్తవ విస్తీర్ణానికి నాలుగైదు రెట్లు అదనంగా రికార్డుల్లో చూపించారు. బాధితుల దాయాదులతో రెవెన్యూ అధికారులంతా కుమ్మకై ్క నకిలీ జాయింట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తయారీ సహా 26 ఫోర్జరీ పత్రాలు, రెవెన్యూ రికార్డులు సృష్టించినట్లు విమర్శలు ఉన్నాయి. కోర్టుకు సైతం తప్పుడు పత్రాలు సమర్పించి, డిక్రీ కూడా పొందేలా అక్రమార్కులకు సహకరించినట్లు తెలిసింది. ఈ అక్రమాల్లో అప్పటి డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ సహా ప్రస్తుత తహసీల్దార్ అయ్యప్ప, డిపూటీ తహసీల్దార్ కీర్తిసాగర్, భూభారతి ఆపరేటర్ నరసింహాచారి పాత్ర ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయా అధికారులపై కేసులు నమోదు చేసి, విచారిస్తున్నారు. సదరు అధికారులు ఇందులో తమ తప్పేమీ లేదని, సివిల్ కోర్టు ఆర్డర్ ప్రకారమే రిజిస్ట్రేషన్ చేశామని, ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీసు, కోర్టు విచారణలో తేలుతుందని చెబుతుండడం కొసమెరుపు.
ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల మున్సిపల్ పరిధిలోని మంగల్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 96లో 4.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గత నెల 17న వహీదాబేగం పేరున ఇదే సర్వే నంబర్‌తో పట్టాదారు పాసు పుస్తకం జారీ అయింది. అసలు సర్వే నంబర్‌కు కొత్తగా 96/1 సర్వే నంబర్‌ను సృష్టించారు. భూ విస్తీర్ణాన్ని కూడా కొత్తగా చూపించారు. ఇప్పటికీ ఈ 96 సర్వే నంబర్ నిషేధిత జాబితాలోనే ఉంది. కానీ సదరు భూమికి ఎలాంటి రికార్డులు లేకుండా, రిజిస్ట్రేషన్లు చేయకుండా భూభారతి పోర్టల్‌లో డీఎస్ పెండింగ్ అని ఎలా కన్పించిందో.. దాని వెనుక ఎవరున్నారో అధికారులకే తెలియాలి. నిజానికి ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ కావాలన్నా, పాసు బుక్ జారీ చేయాలన్నా పోర్టల్ లాగిన్‌లో డిప్యూటీ తహసీల్దార్ లేదా తహసీల్దార్ తప్పనిసరి. ఇక్కడ ఇవేవీ లేకుండా నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్‌కు ఏ విధంగా స్లాట్ బుక్కయింది.. రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది.. పాసు బుక్ ఎలా జారీ అయింది.. అనేది మిస్టరీగా మారింది. తీరా విషయం బయటికి వచ్చిన తర్వాత తమ సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని సంబంధిత అధికారులు నమ్మబలుకుతున్నారు. వారికి తెలియకుండా అధికారిక లాగిన్‌ను ఇతరులెలా ఓపెన్‌ె చేయగలిగారన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది.
జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులంతా ఎన్నికల హడావుడిలో ఉండగా, ధరణి ఆపరేటర్లు మాత్రం పోర్టర్లోకి చొరబడ్డారు. క్షేత్రస్థాయి నివేదికలు, కలెక్టర్ వేలిముద్రలు లేకుండా 2023 అక్టోబర్ 14 నుంచి నవంబర్ 11 మధ్య కాలంలో ఏకంగా 98 వివాదాస్పద దరఖాస్తులను ఆమోదించారు. విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరున కట్టబెట్టారు. విషయం బయటికి తెలిసి ఆదిభట్ల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఇద్దరు ఆపరేటర్ల ప్రమేయం ఉన్నట్లు గుర్తించి విధుల నుంచి తొలగించారు. అప్పటికే ఆయా భూములు చేతులు మారడంతో తర్వాత వచ్చిన అ ధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పోలీసుల కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
అక్రమార్కులపై చర్యలేవీ..?
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ రెవెన్యూ సర్వే నంబర్ 172 నుంచి 183 వరకు ఉన్న 94 ఎకరాల ప్రభుత్వ భూముల హక్కులు/ రికార్డులను ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా రూపొందించి, ఏసీబీ కేసును ఎదుర్కొంటున్న అప్పటి తహసీల్దార్‌ను అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేసి ఊరుకున్నారు. ఇప్పటి వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఇదే అధికారి గతంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్‌గా మునగనూరు రెవెన్యూ సర్వే నంబర్ 44లోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ఆరోపణలు లేకపోలేదు. ఇక మహేశ్వరం మండలం కొంగరకుర్దు రెవెన్యూలోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు సహకరించిన స్థానిక అధికారులపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సర్వేయర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారే కానీ, అప్పటికే బదిలీపై మరో జిల్లాకు వెళ్లిన డిప్యూటీ సర్వేయర్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లి రెవెన్యూ సర్వే నంబర్ 41లోని పలు నిషేధిత భూములకు గుట్టుగా రిజిస్ట్రేషన్లు చేసిన తహసీల్దార్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో అంతు చిక్కడం లేదు.
కోర్టుకు తప్పుడు పత్రాలు సమర్పించి..
ప్రభుత్వ భూమికి పాసు బుక్ జారీ
అప్పడు ‘ధరణి’ పోర్టల్లోకి..
రెవె‘న్యూ’ లీలలు
ప్రభుత్వ భూములకు నకిలీ రికార్డుల సృష్టి
ప్రైవేటు వ్యక్తుల పేరున పట్టాలు.. పాసుపుస్తకాల జారీ
ఆదిభట్ల సర్వే నంబర్ 96/1లో 4.25 ఎకరాలకు ఎసరు
సంతకం ఫోర్జరీ చేశారంటూ ‘పట్నం’ తహసీల్దార్ ఫిర్యాదు
తాజాగా నందివనపర్తి సర్వే నంబర్ 361లోని 8.29 ఎకరాలకు
తప్పుడు పత్రాలు
యాచారం తహసీల్దార్, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, ఆపరేటర్‌పై కేసు నమోదు