శంషాబాద్‌లో ఆరుగురు కార్యదర్శులపై వేటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ, గ్రామకంఠం, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయశాఖ, 111 జీవో పరిధిలో ఉన్న భూముల్లోని అక్రమ వెంచర్లు సహా ఫాంహౌస్‌లు, భారీ కన్వెన్షన్ సెంటర్లు, గోదాములు కొంతమంది పంచాయతీ కార్యదర్శుల పాలిట కామధేనువుల్లా మారుతున్నాయి. అక్రమ నిర్మాణాలు, ఆస్తుల అసెస్మెంట్లు, ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్ల కేటాయింపు కాసుల వర్షం కురిపిస్తోంది. శంషాబాద్, మొయినాబాద్, శంకర్‌పల్లి, అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.
ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్లు
ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు కుమ్మకై ్క పాత తేదీలతో ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే బాలాపూర్ మండలంలో బడంగ్‌పేట్, హయత్‌నగర్ మండలంలోని తట్టి అన్నారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని మునగనూరు, తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల, సీతారాంపూర్, మహేశ్వరం మండలంలోని మన్సాన్‌పల్లిచౌరస్తా, కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట రెవెన్యూల పరిధిలో అనేక ఖాళీ ప్లాట్లకు పాత తేదీలతో ఇంటి నంబర్లు జారీ చేశారు. విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాం తానికి కారణమయ్యారు. భవన యజమానుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా వసూలు చేసిన దాంట్లో ఎంపీఓలకు వాటాలు అందుతున్నట్లు ఫిర్యాదులు లేకపోలేదు. ఇటీవల ఓ ఎంపీఓపై కార్యదర్శులంతా కలిసి ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనం.
ఇనాంగూడ సర్పంచ్,
కార్యదర్శులకు నోటీసులు
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ ఇటీవల సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. పంచాయతీ ఖాతాలో ఉండాల్సిన నగదును నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసి, తన వద్దే నిల్వ చేసుకోవడం, అక్రమ నిర్మాణాలను నియంత్రించక పోవడం, ఆస్తుల అసెస్మెంట్‌లో చేతివాటం ప్రదర్శించడం, నర్సరీ, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనాల నిర్వహణలో నిర్లక్ష్యం, ఆడిట్‌లోనూ అనేక లోపాలు తలెత్తడం సహా ఖాళీ ప్లాట్లు, అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు జారీ చేసినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. ఇనాగూడలోని 16 నిర్మాణాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసిన ఘటనలో ఆ గ్రామ సర్పంచ్‌కి సైతం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్వే నంబర్ 5లోని ప్లాట్‌నంబర్ 455కు సర్పంచ్ స్వయంగా తన సంతకంతో అనుమతులు ఇవ్వడం, నిబంధనలకు విరుద్ధంగా ఓ వ్యక్తిని మల్టీపర్పస్ ఉద్యోగిగా నియమించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
కవ్వగూడ 111 జీఓ పరిధిలో ఉన్న ఓ అక్రమ వెంచర్‌లోని ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్లు జారీ, అక్రమ వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో ఆ పంచాయతీ కార్యదర్శిని ఇటీవల బోటిగూడకు బదిలీ చేశారు.
చౌదరిగూడ పంచాయతీ కార్యదర్శిపై నిధుల దుర్వినియోగం, అక్రమ నిర్మాణాలకు అండగా నిలబడటం, ఇంటి నంబర్ల కేటాయింపు ఆరోపణలు రావడంతో బదిలీ వేటు వేశారు.
పాలమాకుల పంచాయతీ కార్యదర్శికి పిల్లోనిగూడెం పంచాయతీకి స్థానచలనం కల్పించారు.
రామంజాపూర్ కార్యదర్శిని షాబాద్ మండలానికి బదిలీ చేశారు.
ఇటీవలే బదిలీ అయిన పెద్దతూప్రా పంచాయతీ కార్యదర్శిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి.
నానాజీపూర్‌లో అక్రమ నిర్మాణ దారుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.
అక్రమ నిర్మాణాలు, ఆస్తుల అసెస్మెంట్లకు దన్ను
ఖాళీ ప్లాట్లకు ఇంటి నంబర్ల కేటాయింపు
సొమ్ము చేసుకుంటున్న కార్యదర్శులు
పలుచోట్ల సర్పంచులతో కుమ్మక్కు
కొన్ని మండలాల్లో ఫిర్యాదుల వెల్లువ
ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ, మరికొందరిపై బదిలీవేటు


