దెబ్బతిన్న ప్రభుత్వ కార్యాలయాలు
వికారాబాద్: జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరాయి. భవనాలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షం పడిన ప్రతి సారీ ఉరుస్తున్నాయి. ఆయా శాఖల ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మాత్రం మంజూరు కావడం లేదు. బీటలు వారిన కార్యాలయాల్లోనే బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖకు చెందిన భవనాలన్నీ శిథిలావస్థకు చేరాయి. జిల్లా అంతటా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వికారాబాద్, పరిగి ఏడీఏ కార్యాలయాలు అధ్వానంగా తయారయ్యాయి. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, తాండూరు, పరిగి, బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భవనాల కాలం చెల్లిపోయిందని పదేళ్ల క్రితమే ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చారు. అయినా వాటినే కొనసాగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని ఇటీవల తాత్కాలిక భవనంలోకి మార్చారు. తాండూరులోని పశువైద్యశాల భవనం దుస్థితికి చేరింది. పరిగి ఆర్‌అండ్‌బీ బిల్లిండ్ కూడా దెబ్బతింది. మార్కెట్ కమిటీ కార్యాలయాల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.
నాణ్యతకు తిలోదకాలు
బీఆర్‌ఎస్ హయాంలో వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. రైతుల నుంచి 34 ఎకరాల అసైన్డ్ భూములు సేకరించి రూ.60.7 కోట్లతో సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించారు. ఏడేళ్లపాటు పనులు జరిగాయి. 2022 ఆగస్టులో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించారు. రెండేళ్లకే భవనం పెచ్చులూడటం మొదలైంది. ఓ సారి చిన్నచిన్న మరమ్మతులతో సరిపెట్టారు. పనుల్లో నాణ్యత లేకపోవడంతో అక్కడక్కడ దెబ్బతింటోంది. లీకేజీలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు భవనం ఉరుస్తోంది. ఏడాదిగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. కలెక్టరేట్ పరిస్థితే ఇలా ఉంటే మండల కేంద్రాల్లోని కార్యాలయాలు ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.
ఆందోళనలో సిబ్బంది
ప్రతి కార్యాలయంలో పది నుంచి ఇరవై మంది ఉద్యోగులు పని చేస్తుంటారు. భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఉన్నట్టుండి కూలిపోయిన విషయం తెలిసిందే. తమకు కూడా అలాంటి ముప్పు ఉందని పలువురు అంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కాలం చెల్లిన భవనాలను కూల్చి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించాల్సి ఉంది.
ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి
అధ్వానంగా వ్యవసాయ,
ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు
బిక్కుబిక్కు మంటూ
విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు
ప్రతిపాదనలు పంపుతున్నా
మంజూరు కాని నిధులు


