పరిగి: బాలికను వేధించిన బాలుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇటీవల దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో బాలికను ఓ బాలుడు అతని స్నేహితులు వేధించారు. ఈ నెల 22న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడితోపాటు సహకరించిన వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కొండల్‌రెడ్డి తెలిపారు.
రైతుల పక్షాన పోరాటం
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి
పరిగి: అన్నదాతలకు ఏ చిన్న కష్టం వచ్చినా వారి తరఫున బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం కాళ్లాపూర్ రైతులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. దేశానికి అన్నం పెట్టే రైతులను ఇబ్బందులకు గురి చేస్తే గుణపాఠం చెబుతారన్నారు. పేదల భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కోవాలని చూస్తే వారి తరఫున పోరాటం చేశామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాళ్లాపూర్ సర్పంచ్ పులిందర్, మాజీ సర్పంచ్ జంగయ్య, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శ్రీనివాస్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
షాబాద్: అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షురాలు పారిజాత నర్సింహారెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిజాత నర్సింహారెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని వర్గాల సంక్షేమం జరుగుతుందని పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధికి కలసి రండి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: గ్రామాల అభివృద్ధికి రాజకీయలను పక్కన పెట్టి కలిసి రావాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ బన్సీలాల్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయలు చేయాలని, తరువాత అంతా కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి పొదుపును పాటించి గ్రామాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో చాలాసేపు కరెంట్ కోత విధించటంతో తన ఫోన్ లైట్‌తో ఎజెండా అంశాలను ఎమ్మెల్యే చదువుకోవడం కనిపించింది. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు, చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, ఎంఈఓ పురన్‌దాస్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


