కొడంగల్: మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధర్మాపూర్‌లో తాగునీటి సమస్యపై గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ సమీపంలోని కుంటలోని బోరును వినియోగించి నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఈఈ రవికుమార్‌కు సూచించారు. ప్రజలకు తాగునీటి కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని నక్షబాటకు బీటీ రోడ్డు వేయించాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మిషన్ భగీరథ డీఈ శశాంక్ మిశ్రా, తహసీల్దార్ రాంబాబు, ఎంపీడీఓ ఉషశ్రీ, సర్పంచ్ సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ సందర్శన
మండలంలోని అంగడిరాయిచూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, స్టాక్ రిజిస్టర్, వైద్య సామగ్రిని పరిశీలించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని డీఎంహెచ్‌ఎ సుధాకర్ లాల్‌ను ఆదేశించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న తరగతి గదులను పరిశీలించారు. జెడ్పీహెచ్‌ఎస్, మండల పరిషత్, ఉర్దూ మీడియం పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన విధానం, మౌలిక వసతులు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ బుషీరాబేగం, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపల్లిలో ఓటర్ల జాబితా పరిశీలన
మండలంలోని లక్ష్మీపల్లిలో సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాపై కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటికే జారీ చేసిన నోటీసులు ఇంకా జారీ చేయాల్సిన నోటీసుల గురించి సంబంధిత అధికారులను అడిగారు. ఓటర్ల జాబితా సవరణలో ప్రతి వివరాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నక్షత్ర, సర్పంచ్ లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని ఈవీఎం గోదాంను సోమవారం కలెక్టర్ దీపక్ తివారి అదనపు కలెక్టర్ వెంకటాచారితో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీల్‌ను తీశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఆర్‌ఓ స్వర్ణలత, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నెమత్ అలీ తదితరులు ఉన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
అర్హులైన ప్రతి ఒక్కరి ఓటును కాపాడాలి
కలెక్టర్ దీపక్ తివారి


