మాటల మంటలు! | - | Sakshi
Sakshi News home page

మాటల మంటలు!

Sep 16 2026 8:52 AM | Updated on Sep 16 2026 8:52 AM

పోలీసులకు తలనొప్పులు

వికారాబాద్‌: ‘అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాను.. పరిగి ప్రాంతానికి రెండు పారిశ్రామిక వాడులు వస్తున్నాయి.. దోమ, పరిగి మండలాల్లోని ఐదు గ్రామాల ప్రజలు భూములిచ్చేందుకు అంగీకరించారు’ అంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. క్రెడిట్‌ కోసం మాట్లాడిన మాటలు ఆయనకు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అన్నదాతల ఆగ్రహానికి కారణమయ్యాయి. శనివారం కాళ్లాపూర్‌ రైతులు మూకుమ్మడిగా పరిగి బస్టాండ్‌ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి తమ భూములు తీసుకోమని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని భీష్మించారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు అర్ధరాత్రి రంగ ప్రవేశం చేసి రైతుల దీక్షను భగ్నం చేసిన విషయం తెలిసిందే. అన్నదాతల అరెస్ట్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. బీఆర్‌ఎస్‌ నేతలు భూ బాధితులకు అండగా నిలిచారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌ ఎస్పీ స్నేహమెహ్రను కలిసి రైతులను విడిచిపెట్టాలని కోరారు. ఆదివారం ఉదయం కూడా రైతులు ఆందోళనకు దిగారు.

ఇరకాటంలో అధికార పార్టీ

అసెంబ్లీలో ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. రైతుల ఆగ్రహాన్ని అంచనా వేసిన పార్టీ శ్రేణులు ధర్నా స్థలం వద్దకు వెళ్లేందుకు కూడా సాహసం చేయలేదు. దోమ మండలం బట్ల చందారం గ్రామ రైతులు కూడా ఎమ్మెల్యే మాటలను తప్పుబట్టారు. గతంలో దుద్యాల పారిశ్రామిక వాడ ఏర్పాటుకు భూములు సేకరించే సమయంలో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. లగచర్లలో అధికారులపై రైతులు దాడి చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అప్పట్లో అనేక మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్‌, ఆర్‌డీఓ, తహసీల్దార్లు, ఇతర అధికారులు రైతుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సున్నతమైన భూముల సేకరణ అంశాన్ని ఎంతో చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు. గ్రామాల వారీగా రైతులతో సమావేశాలు నిర్వహించి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనలు వారికి వివరిస్తూ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రేడియల్‌ రోడ్డు కోసం భూ సేకరణ విషయంలో అధికారులు సక్సెస్‌ అయ్యారు. పారిశ్రామిక వాడల కోసం కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు అధికారులకు ఇబ్బంది తెచ్చి పెడుతోంది.

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కాళ్లాపూర్‌ భూ బాధిత రైతులకు బీఆర్‌ఎస్‌ అండగా నిలిచింది. అన్నదాతల అరెస్టు విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కాళ్లాపూర్‌కు బయలుదేరారు. అతన్ని పోలీసులు అడ్డుకొని కుల్కచర్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్రమ అరెస్టుపై ఆయన మండి పడ్డారు. పోలీసుల తీరును తప్పుబట్టారు. అర్ధరాత్రి రైతుల అరెస్టుపై వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అరెస్టు విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం ఎస్పీ స్నేహ మెహ్రను కలిశారు. ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలుపుతుంటే అరెస్టు చేయడం సరికాదన్నారు.

సున్నితమైన అంశాన్ని లేవనెత్తి చేతులు కాల్చుకున్న టీఆర్‌ఆర్‌

అన్నదాతల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్‌ఎస్‌

బాధితులకు అండగా ఆందోళనలు

తమ భూముల జోలికి రావొద్దంటున్న కాళ్లాపూర్‌ రైతులు

రైతుల్లో ఆగ్రహం నింపిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు

ఎమ్మెల్యే మాటలు పోలీసులకు తలనొప్పి తెచ్చి పెట్టాయి. వినాయక చవితి పండుగ నేపథ్యంలో వారు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రైతులు రోడ్డెక్కడం, వారిని శాంతింజేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. పెద్ద సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేయాల్సి రావడం సమస్యగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement