తాండూరు టౌన్: ఆదివారం వస్తే తాండూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. తాజాగా అనారోగ్యంతో యువకుడు మృతి చెందిన ఘటనే ఇందుకు నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు పట్టణానికి చెందిన నరేష్(29) తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆదివారం అర్ధరాత్రి తాండూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చాడు. సిబ్బంది ప్రాథమిక చికిత్స కూడా చేయలేదు. వైద్యులు అందుబాటులో లేరంటూ హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు నరేష్‌ను నగరానికి తరలించారు. అక్కడ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పాత తాండూరులో విషాదచాయలు అలుముకున్నాయి. తమ సహచరుడి అకాల మరణ వార్త తెలుసుకున్న అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు గణనాథుడిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. యువకుడి మృతిపై విచారణ జరిపించాలని, వైద్యులు ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పాత తాండూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయకుండా హైదరాబాద్‌కు రిఫర్ చేసి వైద్యులు చేతులు దులిపేసుకుంటున్నారని ఆరోపించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
యువకుడి మృతి
తాండూరు పెద్దాస్పత్రికి ఆదివారం రాత్రి అనార్యోగంతో వచ్చిన వ్యక్తి
వైద్యులు లేకపోవడంతో నగరానికి రెఫర్ చేసిన సిబ్బంది
అక్కడ చికిత్స పొందుతూ మృత్యువాత


