సదక్కతుల్లా ఎక్కడ? | - | Sakshi
Sakshi News home page

సదక్కతుల్లా ఎక్కడ?

Sep 10 2026 8:47 AM | Updated on Sep 10 2026 8:47 AM

సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్‌ విమానాశ్రయ కేంద్రంగా ఎస్కేప్స్‌ ఎపిసోడ్స్‌ నడుస్తున్నాయి. లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ ఆధారంగా (ఎల్‌ఓసీ) ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు చిక్కి.. వీరి కస్టడీ నుంచి పరారైన ధవల్‌ దోషి ఉదంతం మరువక ముందే... కస్టమ్స్‌ అధికారుల వంతు వచ్చింది. అంతర్జాతీయ గోల్డ్‌ స్మగ్లింగ్‌ రాకెట్‌లో కీలక నిందితుడిగా ఉన్న కేరళ వాసి సదక్కతుల్లా కస్టమ్స్‌ అధికారుల కస్టడీ నుంచి పారిపోయాడు. గత నెల 17న తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇండిగో విమానంలో ఓ వ్యక్తి బంగారం పేస్టుతో వస్తున్నాడనే సమాచారం అందింది. దీంతో హైదరాబాద్‌ కస్టమ్స్‌లోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అప్రమత్తమైంది. కేరళకు చెందిన టీపీ సదక్కతుల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్‌రే స్కానింగ్‌లో ఓ నల్లరంగు ప్యాకెట్‌ ఉన్నట్లు గుర్తించారు. తన వద్ద బంగారం పేస్ట్‌ ఉన్నట్లు విచారణలో అంగీకరించాడు. ఓ సీటు కింద ఓ ప్రయాణికుడు వదిలివెళ్లిన ప్యాకెట్‌ను తీసుకున్నట్లు అంగీకరించాడు. ఆ బంగారాన్ని తీసుకొచ్చినందుకు తనకు రూ.10 వేల కమీషన్‌ ఇస్తామని చెప్పారని, హైదరాబాద్‌ విమానాశ్రయం బయట వేచిఉన్న వ్యక్తికి అప్పగించాల్సి ఉందని చెప్పాడు. ప్యాకెట్‌ మొత్తం బరువు ప్యాకేజింగ్‌తో కలిపి 697 గ్రాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాక్షులు సమక్షంలో సదక్కతుల్లాను శంషాబాద్‌లోని ఆర్‌బీ నగర్‌లో ఉన్న బంగారం కరిగించే కేంద్రానికి తీసుకువెళ్లారు. పసిడిని బయటకు తీయడానికి పేస్టును కరిగించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ క్రమంలో సదక్కతుల్లా కస్టమ్స్‌ అధికారి లవ్‌కేశ్‌ కుమార్‌ మీనాను తోసేసి ప్రధాన రహదారి వైపు పరుగెత్తాడు. అధికారులు వెంటపడినా అతడు జనంలో కలిసిపోయి తప్పించుకున్నాడు. దీంతో ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ పేస్టును కరిగించిన తర్వాత 570 గ్రాముల బంగారం బయటపడగా దీని మార్కెట్‌ విలువను రూ.90,56,067గా తేల్చారు. ఈ కేసు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఆర్‌జీఐఏ ఠాణా సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ పి.అశోక్‌ వర్మ ‘సాక్షి’కి తెలిపారు.

అంతర్జాతీయ స్మగ్లింగ్‌ రాకెట్‌ కీలక పాత్రధారి

తిరువనంతపురం నుంచి సిటీకి పసిడి పేస్ట్‌తో...

సమాచారంతో పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు

వారి కస్టడీ నుంచి తప్పించుకుని పరారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement