పెరిగిన పోలింగ్‌ స్టేషన్లు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన పోలింగ్‌ స్టేషన్లు

Aug 19 2026 9:10 AM | Updated on Aug 19 2026 9:10 AM

● మార్పులు చేర్పులకు నెల గడువు

కొడంగల్‌లో ముసాయిదా జాబితా విడుదల

కొడంగల్‌: సర్‌ ప్రక్రియలో భాగంగా కొడంగల్‌ నియోజకవర్గం ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారు. గతంలో 275 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 284కు పెరిగింది. సర్‌కు ముందు నియోజకవర్గంలో 2,51,255 మంది ఓటర్లు ఉండేవారు. ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ తర్వాత ఈ సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 2,11,540 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 39,715 మంది వివిధ కారణాల వల్ల సర్‌ పత్రాలు సమర్పించ లేదు. ఇందులో మరణించిన వారు 9,146 మంది, వలస వెళ్లిన వారు 16,986 మంది, డబుల్‌ ఓటర్లు 10,182, ఇతరులు 3,400 మంది ఉన్నారు. వీరి ఓట్లను తొలగించే అవకాశం ఉంది. సర్‌ సర్వే వల్ల 39,715 ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ఇప్పటి వరకు అధికారుల లెక్క ప్రకారం 2,11,540 మంది ఓటర్లు ఉన్నారు. మార్పులు, చేర్పులు, పేరులో తప్పులు, అడ్రసులో మార్పులు, కొత్త ఓటర్ల నమోదు, ఇతర సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి నెల గడువు ఉందని తహసీల్దార్‌ రాంబాబు తెలిపారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో బీఎల్‌ఓలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నియోజకవర్గం ఏర్పడిందిలా..

1956లో కొడంగల్‌ కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కొడంగల్‌, కోస్గి, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాలతో పాటు మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని పలు గ్రామాలు, కోయిలకొండలోని ఒక గ్రామ పంచాయతీ కలిపి నియోజకవర్గంగా ఉండేది. 2018 వరకు కొడంగల్‌, కోస్గి, బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, మద్దూర్‌ మండలాలు కొడంగల్‌ నియోజకవర్గంలో ఉన్నాయి. 2023లో కొత్తగా మూడు మండలాలు దుద్యాల, కొత్తపల్లి, గుండుమాల్‌ ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం 8 మండలాలు కొడంగల్‌ నియోజకవర్గంలో ఉన్నాయి.

నాటి కర్రకల్లే నేటి కొడంగల్‌

గతంలో కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలో కొడంగల్‌ ఉన్నందున ఈ ప్రాంత ప్రజలు కన్నడ భాషను మాట్లాడేవారు. ఇక్కడ నల్ల బండరాళ్లు ఎక్కువగా దొరికేవట. అందుకే ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటి పైకప్పు నల్లరాళ్లతో కప్పి ఉంటాయి. కన్నడ భాషలో కల్లు అంటే రాయి అని అర్థం. ఈ నియోజకవర్గం కర్ణాటకలో ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని కర్రకల్లు అని పిలిచేవారట. కాలక్రమంలో కర్రకల్లు కొడంగల్‌గా మారిందని పెద్దలు చెబుతున్నారు.

నియోజకవర్గం: కొడంగల్‌

మండలాలు: కొడంగల్‌, దౌల్తాబాద్‌, బొంరాస్‌పేట, దుద్యాల, మద్దూరు, కోస్గి, కొత్తపల్లి, గుండుమాల్‌

మున్సిపాలిటీలు: కొడంగల్‌, కోస్గి, మద్దూరు

ముసాయిదా ప్రకారం ఓటర్లు: 2,11,540 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement