సామాజిక న్యాయం
తాండూరు టౌన్: అసమానతల నిర్మూలనతోనే సామాజిక న్యాయం సిద్ధిస్తుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య అన్నారు. మంగళవారం తాండూరులోని ప్రభుత్వ బాలుర కళాశాల హాస్టల్‌లో కేవీపీఎస్ ఆధ్వర్యంలో 80 ఏళ్ల స్వాతంత్య్రం సామాజిక న్యాయం అనే అంశంపై జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా రోజు రోజుకు దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయన్నారు. ప్రజాస్వామ్యం వారి చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య రక్షణకు యువత నడుం బిగించాలన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన జెన్‌జీ పోరాటం మాదిరిగా మరో పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బీజేపీ పాలితప్రభుత్వాలు దళితులపై కులం పేరుతో జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గప్ప, స్వేరోస్ జిల్లా నాయకులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


