నవ వధువు కిడ్నాప్‌ | - | Sakshi
Sakshi News home page

నవ వధువు కిడ్నాప్‌

Aug 10 2026 7:26 AM | Updated on Aug 10 2026 7:26 AM

నవ వధువు కిడ్నాప్‌ వేగంగా వచ్చి.. సైకిలిస్టును ఢీకొట్టి ఫోన్‌ చోరీ.. నగదు బదిలీ ఉరివేసుకుని యువకుడి బలవన్మరణం రోడ్డు ప్రమాదంలో వార్డు సభ్యుడి మృతి

మంచాల: ఓ నవ వధువు కిడ్నాప్‌ అయిన సంఘటన మంచాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ మధు కథనం ప్రకారం.. మండలంలోని చిత్తాపూర్‌ గ్రామానికి చెందిన ఏర్పుల ప్రవీణ్‌, నగరంలోని ఐఎస్‌ సదన్‌కు చెందిన కళ్యాణి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారం రోజుల క్రితం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట దేవస్థానంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మంచాల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువురి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అమ్మాయి తరఫున ఎవరూ రాలేదు. ఇద్దరూ మేజర్‌ కావడంతో తిరిగి వెళ్లిపోయారు. చిత్తాపూర్‌లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కళ్యాణిని కారులో ఎత్తుకెళ్లారు. ఆదివారం ప్రవీణ్‌ తన భార్యను జ్యోతిబస్‌ అనే యువకుడితో పాటు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కిడ్నాప్‌ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌ : సైకిల్‌పై వెళ్తున్న వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడడంతో తీవ్రగాయాలతో మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిన్నరావిరాల గ్రామానికి రామిడి బాల్‌రెడ్డి (73) ఆదివారం తెల్లవారు జామున 4.25 గంటల సమయంలో సైకిల్‌పై పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో చిన్న రావిరాలలోని గిజ్జ కుంట సమీపానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం డ్రైవర్‌ అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాల్‌ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం మృతిచెందాడు. మృతుడి కూతురు లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కొత్తూరు: ఓ కార్మికుడి మొబైల్‌ ఫోన్‌ చోరీ చేయడమే కాకుండా ఫోన్‌ అన్‌లాక్‌ చేసి ఆన్‌లైన్‌లో నగదు అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో నివాసం ఉంటున్న లింగాల జగన్‌గౌడ్‌ గత నెల 21న విధులు నిర్వర్తించే పరిశ్రమకు వెళ్లేందుకు కొత్తూరు బస్టాండ్‌లో బస్సు ఎక్కే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి అతడి సెల్‌ఫోన్‌ దొంగిలించాడు. అనంతరం గత నెల 23 నుంచి 26వ తేదీ వరకు సుమారు రూ.1.55 లక్షలు ఆయా అకౌంట్లు, ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసుకున్నాడు. ఆలస్యంగా విషయం గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మంచాల: ఉరివేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మంచాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లోయపల్లి గ్రామానికి చెందిన సుగూరి వెంకన్న, కళమ్మ దంపతుల కుమారుడు నర్సింహ (30) వృత్తిరీత్యా కూలీ. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వచ్చి చూడగా నర్సింహ విగత జీవిగా కనిపించాడు. ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యాచారం: నాగార్జునసాగర్‌–హైదరాబాద్‌ రహదారిపై తక్కళ్లపల్లి గేట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వార్డు సభ్యుడు మృతి చెందారు. వివరాలు.. కొత్తపల్లి పంచాయతీ పదో వార్డు సభ్యుడు పోలె శివ (40) ఆదివారం యాచారం నుంచి స్కూటీపై స్వగ్రామానికి వెళ్తున్నాడు. తక్కళ్లపల్లి గేట్‌ వద్ద రోడ్డు దాటుతుండగా మాల్‌ వైపు నుంచి అతి వేగంగా వెళ్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన శివను ఇబ్రహీంపట్నంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య మమత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రమాదానికి కారకులైన వారు మాడ్గుల మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement