‘పాలమూరు’తో సస్యశ్యామలం | - | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’తో సస్యశ్యామలం

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

ధారూరు: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని పేర్కొ న్నారు. సోమవారం ధారూరు రైతు వేదికలో జిల్లా రెవెన్యూ అధికారి స్వర్ణలత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఇళ్ల నుంచి వృథాగా పోయే నీటిని కాపాడుకోవాలని సూచించారు. ఇందుకోసం ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకోవాలన్నారు. ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తుందని తెలిపారు. త్వరలో అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తామన్నారు. మండలంలో ఎన్ని ఇరిగేషన్‌ చెరువులు, కుంటలు ఉన్నాయి.. ఏయే పనులు చేయాల్సి ఉందో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఏఈ జ్యోతిని ఆదేశించారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో తిష్టవేసిన ఐకేపీ సీసీలు రాజకీయం చేస్తున్నారని, వీరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని పలువురు సభ్యులు స్పీకర్‌ను కోరారు. ఏపీఎం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, వెలుగు కార్యాలయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొందని ఏఎంసీ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. కొత్త గ్రామ పంచాయతీలకు ఫీల్డ్‌ అసిస్టెంట్లను నియమించలేదని, ఎఫ్‌ఏలు ఎవరి మాట వినడం లేదని పలువురు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని స్పీకర్‌ ఆరోపించారు. అధికారులు బాధ్యతగా.. జవాబుదారీగా పనిచేయాలని ఆదేశించారు. ధారూరుకు ఇందిరమ్మ ఇళ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని సర్పంచ్‌ ప్రమీల గౌడ్‌ స్పీకర్‌ను కోరారు. అల్లాపూర్‌ పాఠశాల పక్కన పెద్దగుంత ఏర్పడి విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని, వెంటనే దాన్ని పూడ్చివేయాలని సర్పంచ్‌ విజయలక్ష్మి కోరారు. మండలంలోని ఆరు అంగన్‌వాడీ కేంద్రాల్లో 16 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు విన్నవించారు. ధారూరు, నాగసమందర్‌ గ్రామాల్లో పశు వైద్యులు లేరని, దీంతో జీవాలకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ధారూరు – పగిడాల మీదుగా దోన్నాల్‌, రాస్నం వరకు డబుల్‌ రోడ్డు నిర్మించాలని, అసంపూర్తిగా ఉన్న ధారూరు – పీలారం రోడ్డును పూర్తి చేయాలని కోరారు. మండలానికి కొత్తగా 1,814 రేషన్‌ కా ర్డులు మంజూరైనట్లు తహసీల్దార్‌ సాజిదాబేగం తెలిపారు. పూలు, ఉల్లి సాగు చేసే రైతులకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు ఉద్యాన వన మండల అధికారి యమున తెలిపారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సుధీర్‌, ఎంపీడీఓ నర్సింహులు, పీఆర్‌ డీఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారు

త్వరలో అసైన్డ్‌ భూములకు పట్టాలిస్తాం

స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement