అనంతగిరి: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారి జాబితాను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. మొదటి విడతలో మంజూరై పనులు ప్రారంభించని వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో అన్ని మండలాల ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల జాబితాను పంపాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని తెలిపారు. వర్షాలు పడుతున్నందున వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, హౌసింగ్ పీడీ ముక్రం బాబా, డీఆర్‌డీఏ శ్రీనివాస్, డీపీఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.
సర్ వేగవంతానికి చర్యలు
నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 78శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు పేర్కొన్నారు. సోమవారం నగరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ ఎన్నికల ఎన్నికల అధికారికి వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నెమత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 110 వినతులు
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచరాదని, సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 110 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టుర్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్‌ఓ స్వర్ణలత, డీఆర్‌డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సభ్యత్వం కార్డు అందజేత
రెడ్ క్రాస్ సొసైటీలో కలెక్టర్ దీపక్ తివారి సభ్యత్వం తీసుకోవడంతో ఇందుకు సంబంధించిన కార్డును ఆ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో కలిసి కార్డును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూర్ తదితరులు పాల్గొన్నారు.
15లోగా అర్హుల జాబితా అందాలి
కలెక్టర్ దీపక్ తివారి


