మంచాల: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరగాయల జంగారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రం అడుగుజాడలోనే నడుస్తుందన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదల గురించి ఆలోచించే స్థితిలో ఈ ప్రభుత్వాలు లేవని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. అదానీ, అంబానీల ఆస్తులు ఊహించనిస్థాయిలో పెరగడం వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు. నెల రోజుల వ్యవధిలోనే రూ.8 పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన ఘనత కేంద్రానికే దక్కుతుందన్నారు. ఆగస్టు 10న రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగే జైల్‌భరో కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జంగయ్య, నాయకులు కృష్ణ, యాదయ్య, జంగయ్య, జానీ, జంగారెడ్డి, మల్లేష్, పాండు, విజయ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగారెడ్డి


