కారు బైక్‌ ఢీ.. వ్యక్తికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు బైక్‌ ఢీ.. వ్యక్తికి గాయాలు

Jul 25 2026 7:21 AM | Updated on Jul 25 2026 7:21 AM

కారు బైక్‌ ఢీ.. వ్యక్తికి గాయాలు స్కూల్‌ బస్సు కిందపడి చిన్నారి దుర్మరణం నేరాల నియంత్రణ కోసమే కార్డన్‌ సెర్చ్‌ భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని పీఎస్‌లో ఫిర్యాదు

పూడూరు: కారు బైక్‌ ఢీ కొన్న ఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌కు వస్తున్న కారు.. వికారాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బైక్‌ మండలంలోని మన్నెగూడ సమీపంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కొందుర్గు: స్కూల్‌ బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందిన ఘటన జిల్లేడ్‌చౌదరిగూడ మండలం కాస్లాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మనీష, కృష్ణయ్య దంపతుల కూతురు సహస్ర(4) చౌదరిగూడలోని అభ్యాస్‌ విద్యాపీఠం పాఠశాలలో యూకేజీ చదువుతోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు చిన్నారిని స్కూల్‌ బస్సులో పాఠశాలకు పంపించి, పనులకు వెళ్లారు. సాయంత్రం కాస్లాబాద్‌కు చేరుకున్న స్కూల్‌ బస్సు లోనుంచి అందరితోపాటు సహస్ర కిందికి దిగింది. బస్సును రివర్స్‌ తీసే క్రమంలో చక్రాల కింద పడిపోయింది. గమనించిన స్థానికులు షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే సహస్ర చనిపోయిందని స్థానికులు తెలిపారు.

శంకర్‌పల్లి: నేరాల నియంత్రణ కోసమే తనిఖీలు చేపడుతున్నట్లు చేవెళ్ల ఏసీపీ కిషన్‌ అన్నారు. మోకిల ఠాణా పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్‌ ఫేజ్‌–2లో చేవెళ్ల ఏసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానితుల వేలిముద్రలు సేకరించారు. సరైన ధ్రువ పత్రాలు లేని 52 బైక్‌లు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ప్రజల భద్రత కోసం తనిఖీలు చేపట్టామని, ఎవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.

శంకర్‌పల్లి: వారసత్వంగా వచ్చిన తమ భూమిని కొంత మంది వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు విజయానంద్‌గుప్తా గురువారం రాత్రి మోకిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్వాడలోని సర్వే నంబర్‌ 146లో 4.13 ఎకరాల భూమిని 1991లో తమ తాతలు కొనుగోలు చేశారని, అప్పటి నుంచి తామే కబ్జాలో ఉన్నామని తెలిపారు. గురువారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రహరీని కూల్చి, అక్రమంగా తన స్థలంలో కంటైనర్‌ని వేశారని తెలిపారు. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని మోకిల ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement