హ్యామ్ కింద రహదారుల నిర్మాణం
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలన్నా, మౌలిక సదుపాయాలు కావాలన్నా మెరుగైన రవాణా సదుపాయాలు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం రోడ్లను మరింత మెరుగు పరిచేందుకు నూతన ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) కింద రహదారుల ఆధునీకరణతో పాటు నూతనంగా నిర్మించనున్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.160 కోట్లతో 160 కి.మీల మేర రోడ్ల ఆధునీకరణ, నిర్మాణం చేపట్టనున్నారు. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని గ్రామీణ రహదారులు ఇక నుంచి మెరవనున్నాయి.
హ్యామ్ కింద రోడ్ల నిర్మాణం
నియోజకవర్గంలో 24 పంచాయతీరాజ్ రోడ్లు, నాలుగు ఆర్‌అండ్‌బీ రహదారులు హ్యామ్ పథకంలో నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో 40 శాతం భరించనుండగా.. మిగిలిన 60 శాతం సంబంధిత కాంట్రాక్టర్లు బ్యాంకుల ద్వారా రుణం పొంది నిర్మిస్తారు. ఈ రుణాలను కాంట్రాక్టర్ 15 ఏళ్ల వ్యవధిలో తిరిగి చెల్లించడంతో పాటు సంబంధిత కాంట్రాక్టర్ నిర్మించిన రోడ్లు 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యత చూడాల్సి ఉంటుంది. హ్యామ్ పథకం కింద ఎంపికై న రోడ్ల పనులను ప్రారంభినున్నారు. కల్వకుర్తి వ్యాప్తంగా 160 కి.మీల మేర రోడ్లను నిర్మించనున్నారు.
ఈ మార్గాల్లో పనులు
హ్యామ్ పథకంలో ఆమనగల్లు మండలంలో మంగళపల్లి నుంచి అప్రోచ్ రోడ్డు వరకు, కోనాపూర్ నుంచి రాంనుంతల మీదుగా చిన్నతండా వరకు, చింతలపల్లి నుంచి బలుసులపల్లి తండా వరకు, ఆకుతోటపల్లి నుంచి అప్రోచ్ రోడ్డు వరకు రోడ్డును నిర్మించనున్నారు. మాడ్గుల మండలంలో నల్లచెరువు నుంచి అజిలాపూర్ గేటు వరకు, మాడ్గుల నుంచి కలకొండ వరకు, కొల్కులపల్లి నుంచి నాగిళ్ల మీదుగా ఎక్వాయిపల్లి వరకు, బ్రాహ్మణపల్లి నుంచి అన్నెబోయినపల్లి వరకు రోడ్లను ఆధునీకరించనున్నారు. తలకొండపల్లిలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గట్టుప్పలపల్లి వరకు, లింగరావుపల్లి నుంచి రామకృష్ణపూర్ వరకు, ఖానాపూర్ నుంచి చుక్కాపూర్ వరకు తుర్కలపల్లి గేటు నుంచి లింగరావుపల్లి వరకు రోడ్లను నిర్మించనున్నారు. కడ్తాల మండలంలో అన్మాస్‌పల్లి నుంచి జమ్ములబావితండా వరకు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గడ్డమీదితండా వరకు, ఎలుగురాళ్ల తండా నుంచి గడ్డమీది తండా వరకు, అన్మాస్‌పల్లి నుంచి గానుగుమర్లతండా గేటు వరకు రోడ్లను నిర్మించనున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న ఆమనగల్లు నుంచి పోలెపల్లి మీదుగా కలకొండ వరకు, కల్వకుర్తి నుంచి మాదారం మీదుగా కడ్తాల వరకు రోడ్లను ఆధునీకరిస్తారు. కాగా హ్యామ్ కింద ఎంపికై న రోడ్లకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
కల్వకుర్తిలో 160 కి.మీలదారుల ఎంపిక
త్వరలో పనుల ప్రారంభానికి అధికారుల కసరత్తు


