● ముఖం చాటేసిన వరుణుడు
● ఖరీఫ్ సాగుకు వెనుకాడుతున్న రైతులు
నీటి ఆధారిత పంటలు తగ్గిస్తే మేలు
గతేడాది వానలు ఆలస్యంగా కురవడంతో చివర్లో సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ఏడు వానాకాలం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా.. ఆశించిన మేర వర్షాలు పడక రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లు కలిగిన వారు కూడా భూగర్భ జలాలు తగ్గడంతో సాగుకు వెనకడుగు వేస్తున్నారు. అధిక నీటి ఆధారిత పంటలు కాకుండా.. ఆరుతడి పంటలు వేస్తే మంచింది.
– సంతోష్, వ్యవసాయ విస్థరణ అధికారి, దుద్యాల్
దుద్యాల్: వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు గడుస్తున్నా చెప్పుకోదగ్గ వర్షం పడలేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరి సాగుకు వెనకడుగు వేస్తున్నారు. నార్లు పోసేందుకు ఆలోచిస్తున్నారు. వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎల్‌నినో వలన ఈ సారి వానలు తక్కువగా కురుస్తాయని వ్యవసాయ అధికారులు, వాతావరణ శాఖ చెబుతున్నా.. ఆకాశం వైపు కర్షకులు దీనంగా చూస్తున్నారు. ఇప్పటికే మండుతున్న ఎండలకు చెలక పంటలు ఎండు ముఖం పట్టాయి.
అడుగంటిన జలాలు
వరి సాగు చేయాలంటే నీరు సమృద్ధిగా ఉండాలి. ఈ సారి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, తద్వారా వరిని పండించి, పండుగ చేసుకుందామనుకున్న రైతులకు.. మండుతున్న ఎండలతో బోర్లు అడుగంటి ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో వరి నాటు వేయడానికి సరిపడా నీరు అందక, నాటు పనులకు పొలాలను సిద్ధం చేయలేకపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.
సగానికి సగం
మండల పరిధి దుద్యాల్, హస్నాబాద్, లగచర్ల, చిలుముల మైల్వార్, చెట్టుపల్లి తండా, ఈర్లపల్లి, హకీంపేట్, పోలేపల్లి, కుదురుమల్ల, చిలుముల్ మైల్వార్ తదితర గ్రామాల్లో రైతులు అధికంగా వరి పంటలు వేస్తుంటారు. గతేడాది 10 వేల ఎకరాల నుంచి 15 వేల ఎకరాల వరకు వరి సాగైందని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ ఖరీఫ్ ఇలాగే ఉంటే.. వరి సాగు గత ఏడాది కంటే 50 శాతం తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


