పరిగి: సాంకేతిక లోపం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలుగా నిలిచిన ‘భూ భారతి’ సేవలను పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోవడం వలన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయన్నారు. క్రయవిక్రయాలు సాగక రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. కుటుంబ అవసరాలు, అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల పెళ్లి కోసం కొందరు రైతులు తమ భూములను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ భూ భారతి సేవల ఆటంకంతో ఆర్థికంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాంకేతికపరమైన అంశాలపై దృష్టిసారించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజల పక్షాన జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బుగ్గప్ప, నాయకులు ఎండీ హబీబ్, సత్తయ్య, లాలయ్య, చంద్రయ్య, మహబూబ్, చీమ్న తదితరులు పాల్గొన్నారు.


