దౌల్తాబాద్: మండల పరిధి కుప్పగిరిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఇటీవల గ్రామంలో ఓ ఇంటి స్థలం విషయమై ఇరువర్గాల మధ్య పలుమార్లు తగాదాలు చోటుచేసుకున్నాయి. ఇందులో ఓ వర్గానికి చెందిన మహిళ.. గ్రామంలో ప్రదర్శిస్తున్న వీధి నాటకం చూసి వస్తానని మంగళవారం రాత్రి వెళ్లి.. విగతజీవిగా మారింది. విషయం బుధవారం ఉదయం వెలుగు చూడగా.. ఆమెను చంపి దూలానికి వేలాడదీశారని మృతురాలి భర్త మరో వర్గం వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా గురువారం పికెటింగ్ నిర్వహించారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఎస్‌ఐ తెలిపారు.


