హస్తం.. నిస్తేజం!
కొడంగల్‌లో మాత్రమే సునాయాస విజయం తాండూరులో మ్యాజిక్ ఫిగర్‌తో సరి పరిగి, వికారాబాద్‌లో స్వతంత్రుల మద్దతుతో గట్టెక్కిన వైనం ఫలితాలపై పోస్టుమార్టం చేస్తున్నఅధికార పార్టీ నేతలు
పుర పీఠాలను క్లీన్ స్వీప్ చేసినా.. కానరాని జోష్
వికారాబాద్: రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాస విజయం అందుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. తాజాగా వారి సొంత నియోజకవర్గ కేంద్రాల్లో మున్సిపల్ పీఠాలు దక్కించుకునేందుకు చెమటోడ్చాల్సి వచ్చింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో మాత్రమే స్పష్టమైన మెజారిటీ దక్కగా మిగతా మూడు పురపాలిక సంఘాల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్నా ఆ పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలను అసంతృప్తి వెంటాడుతోంది. ఫలితాలను విశ్లేషిస్తే ఓటర్లు ఎమ్మెల్యేలకు ఓ పాఠం నేర్పినట్టే కనిపిస్తోంది. కొడంగల్ పట్టణ పరిధిలో 12 వార్డులు ఉండగా మ్యాజిక్ ఫిగర్ ఏడు. అయితే 10 చోట్ల హస్తం పార్టీ సత్తా చాటింది. ఇదే నియోజకవర్గం పరిధిలోని కోస్గీ మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేసింది. కొడంగల్‌లో మాత్రం రెండు వార్డులు ప్రతిపక్షాలకు అప్పగించాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా చూస్తే కొడంగల్ మినహా నేతలు ఊహించిన ఫలితాలు రాలేదనే చెప్పవచ్చు.
ఆ మూడు చోట్ల..
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా కొడంగల్‌లో మినహా వికారాబాద్, తాండూరు, పరిగిలో స్పీకర్‌తోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు చెమటోడ్చాల్సి వచ్చింది. తాండూరులో 36 వార్డులు ఉండగా 19 మ్యాజిక్ ఫిగర్. ఇక్కడ ఒక్క సీటు కూడా ఎక్కువ రాలేదు. బార్డర్ మార్కులతో పాస్ అయినట్లయ్యింది. ఇక్కడ మొదట్నించి నువ్వా.. నేనా అన్నట్టుగా సాగిన పోరులో అత్తెసరు మార్కులతో కాంగ్రెస్ గట్టెక్కింది. వికారాబాద్, పరిగి మున్సిపాలిటీలతో పోలిస్తే ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పోరాటం కాస్త పర్వాలేదనిపించింది. వికారాబాద్ విషయానికి వస్తే 34 వార్డులుకు గాను 18 వార్డులు మ్యాజిక్ ఫిగర్ కాగా.. హస్తం పార్టీ 17 వార్డుల వద్దే వారి పోరాటం ఆగిపోయింది. గెలిచిన స్వతంత్ర అభ్యర్థిని, ఓ బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా పుర పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఉండటం.. ఆయన కూతుర్నే చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించినా సునాయాస విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక్కడ ఆర్థికంగా.. సామాజికంగా అధికార పార్టీలో బలమైన నేతలు ఉండటం, స్పీకర్ ప్రాతినిథ్యం వహిస్తుండటం కూడా కొంత కలిసొచ్చింది. ఇక పరిగి విషయానికి వస్తే చైర్ పర్సన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరి నిమిషం వరకు అధికార, ప్రతిపక్షాల మధ్య దోబూచులాడిన పుర పీఠం ఎట్టకేలకు హస్తగతమైంది. ఇక్కడ ఎమ్మెల్యేతో సహా కాంగ్రెస్ నేతల ఓవర్ కాన్ఫిడెంట్‌తో మున్సిపాలిటీని చేజార్చుకున్నంత పనిచేసింది. 18 స్థానాలకు 18 కై వసం చేసుకుంటామని నామినేషన్ల సమయంలో తొడగొట్టడంతో ప్రారంభమైన వారి అతి విశ్వాసం ఓటమి అంచుల వరకు తీసుకెళ్లింది. దీన్ని వారు గుణపాఠంగా తీసుకోకపోతే మున్ముందు ఇక్కడ ఆ పార్టీ పుట్టి మునగక మానదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ముందే చేతులెత్తేసిన బీఆర్‌ఎస్
జిల్లాలోని
నాలుగు మున్సిపాలిటీల పరిధిలో వంద వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా బీఆర్‌ఎస్ మాత్రం సమరానికి ముందే అస్త్ర సన్యాసం చేసింది. కొడంగల్‌లో 12 వార్డులు ఉండగా 9చోట్ల మాత్రమే అభ్యర్థులను నిలిపారు. మిగిలిన 3 వార్డుల్లో మిన్నకుండి పోయారు. ఇది కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చిందనే చెప్పవచ్చు. వికారాబాద్, కొడంగల్‌లో పార్టీ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించకపోవడం.. వికారాబాద్‌లో పోలింగ్‌కు ముందే యూనానిమస్ అయిన అభ్యర్థి అధికార పార్టీలో చేరడం, మరో అభ్యర్థి కూడా హస్తం గూటికి చేరి అధికార పార్టీ అభ్యర్థి గెలుపునకు దోహదం చేయడం లాంటి పరిణమాలు జిల్లా నేతల అసమర్థతకు అద్దం పడుతోంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్ మొదట్నుంచి గట్టిగా ప్రయత్నం చేసి ఉంటే.. అధికార పార్టీకి దీటుగా ముందుకు సాగి ఉంటే పరిగి, వికారాబాద్‌లలో ఫలితాలు మరోలా ఉండేవని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, ఆనంద్, రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి వారి పూర్తి సామర్థ్యాన్ని కనబర్చలేదనే విమర్శలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ విషయంలో ఓటర్లు కొంత సానుకూల ధృక్పథంలో ఉన్నప్పటికీ దాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హస్తం.. నిస్తేజం!


