పౌర సేవలపై ప్రత్యేక దృష్టి
తాండూరు: పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తాండూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. గతంలో రెండు సార్లు కౌన్సిలర్‌గా పని చేసిన అనుభవం ఉందని పేర్కొన్నారు. పట్టణ సమస్యలు తనకు తెలుసని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అండతోనే పదవి దక్కిందన్నారు. తొలి కౌన్సిల్ సమావేశంలో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సాయిపూర్ ప్రాంతంలోని 11, 12 వార్డులు వర్షాలకు ముంపునకు గురవుతున్నాయని.. కాలువల నిర్మించి సమస్యకు చెక్ పెడతామన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని.. ఎమ్మెల్యే సహకారంతో పనులు చేపడతామని తెలిపారు. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు అన్నదాతల బాధలు తెలుసన్నారు. పట్టణంలో కూరగాయల విక్రయానికి సరైన సదుపాయం లేదని, త్వరలో మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే చిలుక వాగు ప్రక్షాళన పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. గొల్ల చెరువు మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేస్తామన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.


