అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
● కలెక్టర్ ప్రతీక్ జైన్
● అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్‌కు ఘనంగా వీడ్కోలు
అనంతగిరి: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసినప్పుడే గుర్తింపు వస్తుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపినప్పుడే సంతృప్తి కలుగుతుందన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన సేవలను కొనియాడారు. అనంతరం లింగ్యా నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో పనిచేయడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్, డీఆర్‌ఓ మంగీలాల్, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్, డీబీసీడీఓ కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు.
‘కోట్‌పల్లి’ రైతులకు పంట సెలవు దినం
కోట్‌పల్లి ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ప్రభుత్వం పంట సెలవు దినంగా ప్రకటించిందని కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చాలా కాలంగా మరమ్మతు, ఆధునీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రాజెక్టును బలోపేతం చేయాల్సి ఉందన్నారు. 2025 – 26 రబీ సీజన్‌లో కుడి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. 24 కిలో మీటర్ల మేర పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్ణీత సమయంలో కాలువ మరమ్మతు పనులు పూర్తి చేసి నీటి పారుదల సామర్థ్యాన్ని పెంచుతామని వివరించారు. ఇందుకు రైతులు సహకరించి ప్రాజెక్టు కుడి కాల్వ కింద పంటలు వేయరాదని కలెక్టర్ కోరారు.


