రూ.60 కోట్లతో 60 ఫీట్ల రోడ్డు
కొడంగల్: కొడంగల్ లాహోటీ కాలనీలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి నుంచి వినాయక చౌరస్తా మీదుగా బాపల్లి వరకు పట్టణ ప్రధాన రహదారిని విస్తరించనున్నారు. ఇందులో భాగంగా కోల్పోతున్న ఇళ్లు, ఇతర నిర్మాణాలు, ఖాళీ స్థలాలను ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ అధికారులు శనివారం పరిశీలించి, పరిహారం చెల్లింపు కోసం కొలతలు తీసుకున్నారు. రోడ్డు మధ్య నుంచి అటు 30, ఇటు 30 మొత్తం 60 ఫీట్ల రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. 16 కిలోమీటర్ల మేర విస్తరించనున్న ఈ రోడ్డుకు ప్రభుత్వం రూ.60 కోట్లు మంజూరు చేసింది. పరిహారం చెల్లింపుల అనంతరం పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
హైవే పనుల్లో జాప్యం..
పట్టణంలోని వినాయక చౌరస్తా ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. మహబూబ్‌నగర్– చించోలీ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వినాయక చౌరస్తాను విస్తరిస్తున్నారు. దీనికి సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పాటు హాస్టుళ్లు ఉన్నాయి. నిత్యం వేలాది మంది విద్యార్థులు రాకపోకలతో ఈప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈమార్గంలో ఆగే ఆర్టీసీ బస్సులతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. మహబూబ్‌నగర్– చించోలీ (ఎంసీ) అంతర్రాష్ట్ర రహదారిని కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేగా మార్చింది. మహబూబ్‌నగర్ నుంచి కొడంగల్, తాండూరు మీదుగా కర్నాటక రాష్ట్రం చించోలీ వరకు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ జాతీయ రహదారికి 167ఎన్‌గా పేరు పెట్టారు. బెంగళూరు, ముంబై జాతీయ రహదారులను కలిపే ఈ రోడ్డును విస్తరిస్తున్నారు. మహబూబ్‌నగర్, కోస్గి, కొడంగల్, తాండూరు మీదుగా చించోలి, మన్నాకెళ్లి వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక చౌరస్తాను వెడల్పు చేస్తున్నారు.
కొడంగల్ ప్రధాన రహదారికి
నిధులు మంజూరు
సీఎం ఇంటి నుంచి
బాపల్లి వరకు నిర్మాణం
భూ బాధితులకు త్వరలోనే పరిహారం
ఆవెంటనే పనులు ప్రారంభం
త్వరగా పూర్తి చేయాలి
కొడంగల్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి. రోడ్డు విస్తరణ, మురుగు కాల్వల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. పట్టణ ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న మురుగు కాల్వల పనులను త్వరగా పూర్తి చేయాలి. వ్యాపారాలు లేకపోవడంతో దుకాణదారులు అద్దెలు కట్టలేని పరిస్థితి ఏర్పడింది.
– మురహరి వశిష్ట,
లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు, కొడంగల్
రూ.60 కోట్లతో 60 ఫీట్ల రోడ్డు


