సర్కిల్ గాయబ్
తుర్కయంజాల్: తుర్కయంజాల్ మున్సిపాలిటీని డిసెంబర్ 3న జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన ప్రభుత్వం సర్కిల్‌గా ప్రకటించి.. ఆవెంటనే ఆదిబట్ల సర్కిల్‌లో విలీనం చేయడంతో స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల చెంతకు పాలన తెస్తామని చెప్పిన సర్కార్ దూరం చేయడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డివిజన్‌ల విభజనపై నిరసనలు చేపడుతుండగా.. సర్కిల్ కార్యాలయాన్ని తరలించడంపై స్థానికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వందల కొద్ది అభ్యంతరాలు
2018 ఆగస్టు 2వ తేదీకి ముందు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని తుర్కయంజాల్, రాగన్నగూడ, కమ్మగూడ, ఇంజాపూర్, తొర్రూర్, బ్రాహ్మణపల్లి, మునగనూర్, కొహెడ, ఉమర్‌ఖాన్‌గూడలను కలిపి తుర్కయంజాల్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. 76 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 77,217 మంది ఓటర్లు ఉండగా, 24 వార్డులు ఉండేవి. జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన ప్రభుత్వం ఇంజాపూర్, రాగన్నగూడలోని కొంత ప్రాంతం, తుర్కయంజాల్ గ్రామాన్ని కలుపుతూ 56వ డివిజన్‌గా తుర్కయంజాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ వార్డు పరిధిలో 20వేల–25వేల వరకు మాత్రమే ఓటర్లు ఉండే అవకాశం ఉంది. మిగిలిన 50 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ప్రాంతాన్ని 53వ డివిజన్ తొర్రూర్‌గా ఏర్పాటు చేసిన విషయం విదితమే. 10 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణం, 20వేల వరకు ఓటర్లు ఉన్న కొహెడను డివిజన్‌గా మార్చాలని కోరుతూ 1,200కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నింటిని కొట్టి పారేసిన జీహెచ్‌ఎంసీ నిర్ణయాన్ని ఏ మాత్రం సడలించుకోకపోగా సర్కిల్‌నే ఎత్తివేయడం గమనార్హం.
సర్కిల్ కార్యాలయానికి 17 కిలోమీటర్లు
తొర్రూర్ డివిజన్‌లోని ఉమర్‌ఖాన్ గూడ, మునగనూర్, ఇంజాపూర్ నుంచి ఆదిబట్ల సర్కిల్ కార్యాలయం 17 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. తుర్కయంజాల్ నుంచి 10 కిలో మీటర్లకు పైగా దూరం ఉంది. అక్కడకు వెళ్లేందుకు వ్యక్తిగత వాహనాలు, ట్యాక్సీ సర్వీసులను ఆశ్రయించాల్సిందే. ఆర్టీసీ బస్సులు, ఆటోలు ప్రత్యేకంగా ఉండవు. ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్‌లు, బర్త్, డెత్ సర్టిఫికెట్‌లు, మ్యుటేషన్‌లు, పన్నుల చెల్లింపులు, ఇతర ఫిర్యాదులు, పనుల నిమిత్తం సర్కిల్ కార్యాలయానికి సామాన్యులు వెళ్లడం కష్టంతో కూడుకున్న పని అని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభ్యంతరాలు, ధర్నాలు, సంతకాల సేకరణను పట్టించుకోని ప్రభుత్వం
ఆదిబట్ల సర్కిల్ పరిధిలోకి తుర్కయంజాల్
స్థానికుల నుంచి విమర్శల వెల్లువ


