ఆశల బకాయి బిల్లులు చెల్లించాలి
అనంతగిరి: ఆశ వర్కర్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆశలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలన్నారు. 2022 నుంచి 2025 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం లెప్రసీ సర్వే చేపట్టిందని, జిల్లాలో కూడా 15 రోజుల పాటు సర్వే చేయించారని పేర్కొన్నారు. సర్వే చేసినందుకు రోజుకు ఒక ఆశ కార్యకర్తకు రూ.70 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ కార్యక్రమం ముగిసి ఏడాది పూర్తయినా ఇప్పటివరకు డబ్బులు విడుదల చేయలేదన్నారు. కావున బకాయి బిల్లులను వెంటనే వారి ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్‌ఐ, పీఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడురామకృష్ణ, కోశాధికారి చంద్రయ్య, తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షురాలుఅమృత, కార్యదర్శి మంగమ్మ, ఉమ, పద్మ, అనురాధ, అరుణ, కౌసల్య, జగదేవి, మునిబాయి, లక్ష్మి, మధులత, సుజాత, శ్రీదేవి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్


