శ్రీవారి నిజరూప దర్శనం
● కొడంగల్ వేంకటేశ్వరస్వామికి
ఘనంగా అభిషేకం
● జనవరి 16 వరకు
ధనుర్మాసపూజలు, తిరుప్పావై
కొడంగల్: పేదల తిరుపతిగా పేరుగాంచిన పద్మావతీ సమేత శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరాలయంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. కలియుగ దైవమైన స్వామివారు నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు శ్రీవారి మూలమూర్తికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిత్య పూజలు, కై ంకర్యాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పలు రకాల పూలతో స్వామివారిని అందంగా అలంకరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయంలో ధనుర్మాసాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ధరూర్ శ్రీనివాసాచార్యులు తిరుప్పావై పారాయణం చదివి వినిపిస్తున్నారు. ఈనెల 16నుంచి జనవరి 14 వరకు నిత్యం ధనుర్మాసపూజలు, తిరుప్పావై కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు సన్నాయి, 5 గంటలకు సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, 6 గంటలకు తిరుప్పావై ప్రవచనం ప్రసాద వితరణ ఉంటుంది. ఈనెల 30న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న శ్రీ గోదాదేవి కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం, 16న కనుమ, నీరాటోత్సవం, అలంకార తిరుమంజనం నిర్వహిస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోంగా పూజలు కొనసాగుతాయన్నారు.


