ధ్యాన కేంద్రానికి వెళ్తూ.. అనంతలోకాలకు..
● ఔటర్‌పై డివైడర్‌ను ఢీకొన్న క్వాలీస్ వాహనం
● మహిళ మృతి.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
శంషాబాద్ రూరల్: ఔటర్‌పై అతి వేగంగా వెళ్తున్న క్వాలీస్ వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలకు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డికి చెందిన కొత్తగడి శిరీష(31), ఆమె కుమార్తె సృజన(10), బంధువులతో కలిసి క్వాలీస్ వాహనంలో శుక్రవారం తెల్లవారుజామున కడ్తాల్‌లోని ధ్యాన కేంద్రానికి బయలుదేరారు. వీరి వాహనం మండలంలోని పెద్దగోల్కొండ సమీపంలోకి రాగానే ఔటర్‌పై డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడిన శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమార్తె సృజనతో పాటు సంధ్య, వీరమని, శారద, సంధ్య కుమార్తె అభిజ్ఞ(9)కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షత్రగాత్రులను శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. డ్రైవర్ అజాగ్రత్త, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


