ఇసుక తరలిస్తున్నారని కర్రలతో దాడి
● ట్రాక్టర్ యజమానితో పాటు
మహిళకు తీవ్రగాయాలు
● దాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు
బషీరాబాద్: ఇసుక తరలించేందుకు వచ్చారని ఆరోపిస్తూ ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టి, గాయపర్చిన ఘటన కంసాన్‌పల్లి(బి)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మైల్వార్ గ్రామానికి చెందిన దానం సాయిలు బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రెండు ట్రాక్టర్లు తీసుకుని, కంసాన్‌పల్లి రైతులు గొల్ల కృష్ణ, గొల్ల అశోక్‌కు చెందిన పొలం వద్దకు చేరుకున్నాడు. కూలీలతో కలిసి ఇక్కడ మేట వేసిన ఇసుకను తవ్వేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడే ఉన్న కృష్ణ, అశోక్ అడ్డుకుని, కర్రలతో దాడి చేశారు. సాయిలుతో పాటు యశోదమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపర్చారు. హడలిపోయిన బాధితులు ట్రాక్టర్లు అక్కడే వదిలేసి ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ విషయమై బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్లర్లతో పొలం వద్దకు వెళ్తుండగా మధ్యలో అడ్డుకున్న కృష్ణ, అశోక్ తమపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారణ జరిపిన తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఐ విఠల్ ఇరువర్గాలతో మాట్లాడి, దాడికి పాల్పడిన ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇసుక తరలిస్తున్నారని కర్రలతో దాడి


