విద్యారంగం నిర్వీర్యానికి కుట్ర
అనంతగిరి: విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తక్షణమే విరమించుకోవాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్ ప్రధాన సంపాదకుడు మాణిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం అధ్యక్షతన బుధవారం వికారాబాద్‌లో సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాణిక్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్న లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలన్నారు. ఫైనాన్స్ బిల్లు సైతం పెన్షనర్లకు ఉరితాడుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఓ వైపు ప్రపంచం మొత్తం ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతుండగా, ఇక్కడ మాత్రం 25 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించిన టీచర్లు సైతం టెట్ పరీక్ష రాయాలంటూ నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. సర్వీస్‌లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు పరీక్ష పాస్ కాకపోతే వృత్తిని వదుకోవాల్సిన దుస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశాన్ని ఇటీవల పలువురు ఎంపీలు సభ దృష్టికి తీసుకెళ్లినా, కేంద్ర విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లుగా విద్యారంగ పురోగమనంపై మాట్లాడటం మినహా ఇందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రాములు, ఉపాధ్యక్షుడు బి.నర్సింలు, కోశాధికారి మొయిజ్‌ఖాన్, జిల్లా కార్యదర్శులు ఎన్.బాబురావు, టి.పవన్ కుమార్, బసప్ప, వెంకటయ్య, ముత్తప్ప, సలీం, నర్సింలు, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ చర్యలను
విరమించుకోవాలి
లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్
ప్రధాన సంపాదకుడు మాణిక్‌రెడ్డి


