వరివైపే మొగ్గు
● ఇతర పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడమే కారణం
● ప్రస్తుత సీజన్‌లో పెరగనున్న సాగు విస్తీర్ణం
దౌల్తాబాద్: రైతన్నలు ఎక్కువగా వరిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. అన్ని రకాల పంటల సాగుపై అవగాహన ఉన్న వారు సైతం వరినే ఎంచుకుంటున్నారు. తరచూ వరిసాగు చేయడంతో భూసారం తగ్గి అధిక దిగుబడి సాధించడం కష్టమే. మండలంలో గత యాసంగిలో సుమారు ఐదువేల ఎకరాల్లో వరిసాగు చేస్తే ప్రస్తుత సీజన్‌లో మరో వెయ్యి ఎకరాల్లో అదనంగా సాగు చేయనున్నట్లు అంచనా. చెరువులు, బావుల కింద ఎక్కువగా వరి వేస్తారు. మంచి దిగుబడులు వస్తుండటంతో ఇదే పంటను మళ్లీమళ్లీ వేస్తున్నారు. చెరుకు, చిరుధాన్యాలు, కూరగాయల సాగుకు యోగ్యమైన నేలలు ఉన్నా ఇవన్నీ దీర్ఘకాలిక, మద్దతు ధర లేని పంటలు కావడంతో వీటి జోలికి వెళ్లడం లేదు. దీనికి తోడు సరైన మార్కెటింగ్, రవాణా సౌకర్యం లేకపోవడంతో చెరకు, ఉద్యాన పంటలను తగ్గించారు. ప్రస్తుతం రైతులు వేసిన తుకాలు ఎదగకపోతే సంక్రాంతి తర్వాత పెసర, మినుము సాగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో వ్యవసాయధికారులు రైతుల పొలాలకు వెళ్లి వారి భూమి పరీక్ష చేయించి వాటి ఫలితాలను కూడా అందించారు. నేల సారాన్ని బట్టి పంటలు వేయాలని చెబుతున్నారు.
మండలంలోని రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాం. నీటి వనరులు లేని రైతులకు ఆరుడి పంట సాగు చేయాలని సూచించాం. భూసారాన్ని బట్టి నేలలో ఉన్న పోషకాలను వినియోగించుకుని వాటికి తగ్గ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించాం.
– లావణ్య, ఏఓ, దౌల్తాబాద్
నాటుకు సిద్ధంగా నారు


