షార్ట్ సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
● రూ.6 లక్షల నష్టం
● ప్రభుత్వం ఆదుకోవాలనిబాధితుల వేడుకోలు
యాలాల: షార్ట్ సర్క్యూట్‌తో కిరాణా దుకాణం దగ్ధమైన ఘటన మండలంలోని ముద్దాయిపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోచనగారి వినోద, వెంకటయ్యగౌడ్ దంపతులు తాండూరులోని ఎస్‌బీఐ(ఏడీబీ) నుంచి మూడేళ్ల క్రితం రూ.10 లక్షల రుణం తీసుకుని, వ్యాపారం చేస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి కొట్టు మూసేసి, వెనకాలే ఉండే ఇంటికి వెళ్లిపోయారు. అర్ధరాత్రి వేళ దుకాణంలో నుంచి మంటలు ఎగిసి పడటాన్ని గమనించిన స్థానికులు యజమానిని నిద్ర లేపి, మంటలు ఆర్పారు. అప్పటికే ఆలస్యం కావడంతో కొట్టులోని ఖరీదైన వస్తువులు, భారీ రిఫ్రిజిరేటర్, పప్పుల సంచులు, చక్కెర, పిండిబస్తాలు, గల్లాపెట్టెలోని నగదు, ఇతర సరుకులు పూర్తిగా కాలిపోయాయి. దీంతో తనకు సుమారు రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


